Vizianagaram News : ఓ వైపు ఇంట్లో ఇల్లాలిగా.. మరోవైపు పోటీ ప్రపంచంలో పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆహ్లాదాన్ని పంచేలా విజయనగరం నడిబొడ్డున ప్రత్యేకంగా పార్కు సిద్ధమైంది. మహిళలను ఆకర్షించేలా.. ఆరోగ్యం పంచేలా సకల సదుపాయాలున్న ఈ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రకాశం పార్కును ప్రత్యేకించి మహిళల కోసం తీర్చిదిద్దారు. అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమృత్ పథకం కింద మంజూరైన రూ.1.10 కోట్లు, కార్పొరేషన్ సాధారణ నిధులు మరో రూ.90 లక్షలతో పార్కు నిర్మాణ పనులు పూర్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8నే తొలుత దీన్ని ప్రారంభించాలనుకున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడిరది. త్వరలోనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మహిళలకు మాత్రమే
గతంలో ఇక్కడ ప్రకాశం పార్కు ఉండేది. సుమారు దశాబ్ద కాలంగా ఆదరణకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో దీన్ని సుమారు రూ.2 కోట్ల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దారు. విజయనగరం పట్టణంలోని నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు... రాష్ట్రంలోనే మొదటి మహిళా పార్కుగా గుర్తింపు పొందనుంది. ఇందులో మహిళలు, చిన్నారులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకునేలా సదుపాయాలు కల్పించారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కుతోపాటు.. ఈత సాధన కోసం స్విమ్మింగ్ పూల్‌నూ ఏర్పాటు చేయడం విశేషం. పార్కులో ఎటువైపు చూసినా ప్రకృతి పలకరించేలా.. అందమైన చెట్లు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. వీటికితోడు సుందరంగా వివిధ రకాల మొక్కలు నాటారు. పార్కులో వసతుల కల్పన, రోజువారి నిర్వహణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని భావిస్తున్నారు. కార్పొరేషన్ పాలకవర్గంలో షార్కుకు అనుబంధంగా ఉన్న డివిజన్ల పరిధిలో మహిళా నాయకులకు కమిటీలో అవకాశం కల్పించాలని నిర్ణయించారు.