Minister Botsa : విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నిచారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఆయన గుర్తించిన లోపాల పట్ల అధికారులపై చర్యలు తీసుకున్నారన్నారు. పర్యవేక్షణ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే టీచర్లకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. జులై నెలలో వచ్చిన పుస్తకాలు ఇప్పటి వరకు పిల్లలకు ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? సస్పెండ్ చేసిన అధికారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిశీలిస్తామన్నారు. తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విద్యా శాఖలో 10 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారని, వారందరూ ప్రతి నెల క్షేత్రస్థాయి పరిశీలన చేసే విధంగా ఉత్తర్వులు ఇస్తానన్నారు.
సీఎం జగన్ పర్యటనపై సమీక్ష
"మంత్రి రాంబాబు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో జనవనరుల ప్రాజెక్టులపై ఆయనతో చర్చించాం. ఎక్కడ ఆలస్యం అవుతుందో ఆయన తెలుసుకున్నారు. సీఎం జగన్ వద్ద ఈ విషయాలు చర్చించి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, ప్లోటింగ్ జెట్టీకి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించాం." - మంత్రి బొత్స సత్యనారాయణ
అసలు టీచర్లకు సంబంధం ఏంటి?
"విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లాల్లో పర్యటిస్తూ నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. దీనికి టీచర్లు ఆందోళన చేయడం ఏంటి. జూన్ నెలలో విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వమని చెప్పాం. ఇప్పటి వరకూ ఆ పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకూ పుస్తకాలు ఇవ్వలేదని వారిపై చర్యలు తీసుకున్నాం. అధికారులపై చర్యలు తీసుకుంటే టీచర్లు ఆందోళన చేయడం ఏంటి. అసలు టీచర్లకు సంబంధం ఏంటి. పుస్తకాలు పిల్లలకు ఇవ్వకపోతే చదువు ఎలా చెప్పారు. ఈ విషయంపై టీచర్లకు సమస్య ఉంటే నేను పరిష్కరిస్తాం. ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని త్వరలో అధికారిక ఉత్తర్వులు ఇస్తాం." - మంత్రి బొత్స సత్యనారాయణ
విద్యాశాఖ అధికారులపై ప్రవీణ్ ప్రకాష్ చర్యలు
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కె.జి.బి.వి. రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్ధులతో మాట్లాడారు. వారి పుస్తకాలను పరిశీలించారు. నవంబర్‌లో ఇవ్వాల్సిన రెండో సెమిష్టర్ లెక్కలు పుస్తకాలను నేటికీ పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు ఇవ్వకపోవడానికి గల కారణాలను పాఠశాల ఉపాధ్యాయులను అడిగితెలుసుకున్నారు. ఆ మేరకు వీరఘట్టం ఎం.ఇ.ఓ. కృష్ణమూర్తి, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ అధికారి రోజా రమణి, కె.జి.బి.వి. ప్రిన్సిపాల్ రోహిణి ని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి తమ విధుల పట్ల నిర్లక్ష్యం గా ఉన్నందున డి.ఇ.ఓ. రమణని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ ఆర్. జె.డి. జ్యోతి కుమారికి అదనపు బాధ్యతులు అప్పగిస్తూ ఉత్తర్వులను విడుదుల చేశారు. డి.ఇ.ఓ. స్థాయి అధికారి మీద ప్రవీణ్ ప్రకాశ్ చర్యలు తీసుకోవడం విద్యాశాఖలో కలకలం సృష్టించింది. పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరగకపోవడంపై సీతంపేట ఐటిడిఎ పీవో కల్పన కుమారిని విచారణ చేయాలని ఆదేశించారు.