Minister Botsa Satyanarayana : మూడు రాజ‌ధానుల ఏర్పాటు కోసం రోడ్‌ మ్యాప్ త‌యార‌వుతోంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చెప్పారు. విజయనగరం క‌లెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ‌లో ల‌క్షలాది మందితో జ‌రిగిన గ‌ర్జన విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా, మూడు రాజ‌ధానుల‌పై ప్రజాభిప్రాయం తేట‌తెల్లమ‌య్యింద‌ని అన్నారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటు త‌థ్యమ‌ని, విశాఖ‌ప‌ట్నం ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుంద‌ని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వ‌ర‌కు ఫేక్ రైతుల‌తో అమ‌రావ‌తి పాద‌యాత్ర జ‌రిగింద‌ని ఆరోపించారు. సుమారు 600 మంది రైతుల‌కి కోర్టు అనుమ‌తి ఇచ్చిన‌ప్పటికీ, వారిలో క‌నీసం 60 మందికి కూడా గుర్తింపు కార్డులు లేవ‌ని అన్నారు. అది రైతుల ముసుగులో టీడీపీ నాయ‌కులు చేసిన పాద‌యాత్రగా పేర్కొన్నారు. అందుకే ఆ ఫేక్‌ పాద‌యాత్ర ఆగిపోయింద‌ని అన్నారు. విశాఖ రాజ‌ధాని అయితే ఉత్తరాంధ్ర బాగుప‌డుతుంద‌ని, దీనికి ప్రతీ ఒక్కరూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయానికి, కేంద్రీయ గిరిజ‌న విశ్వవిద్యాల‌యానికి వ‌చ్చే నెల‌లో ప్రధాన‌ మంత్రి చేత శంకుస్థాప‌న చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మంత్రి బొత్స వెల్లడించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే బొత్స అప్పల‌ న‌ర‌స‌య్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  


వచ్చే నెలలో శంకుస్థాపన 


అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిపాలనా  రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లు అయిందన్నారు.  విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి ఉన్న అడ్డంకులు త్వరలో పరిష్కారమవుతాయన్నారు. త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తామన్నారు.  విజయనగరం జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులు పండించిన చెరకును క్రషింగ్‌ కోసం శ్రీకాకుళం జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, చెల్లింపు ధరపై మంత్రి బొత్స అధికారులతో సమీక్షించారు. వచ్చే నెలలో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్ పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందన్నారు. కోర్టు వివాదాలు ఉన్నాయని, అవి త్వరలో పరిష్కారమవుతాయని వెల్లడించారు.  


పాదయాత్ర ముగిసినట్లే 
 
 టీడీపీ వెనకుండి నడిపిస్తోన్న అమరావతి రైతులు పాదయాత్ర ముగిసినట్లే మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాదయాత్రలో ఎంతమంది ఉన్నారో అందుకు సంబంధించిన ఆధారాలు కోర్టు కోరిందన్నారు.  600 మందితో సాగుతున్న అమరావతి పాదయాత్రలో 60 మంది కూడా రైతులు లేరన్నారు. టీడీపీ ముసుగులో సాగుతున్న అమరావతి రైతులు పాదయాత్రను ఆపేశారన్నారు. పాదయాత్ర ముగిసినట్లే అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.  


డ్రామా ఆర్టిస్టులు


అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్రలో అన్నదాతల కంటే డ్రామా ఆర్టిస్టులే ఎక్కువ మంది ఉన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం  మండిపడ్డారు. రైతుల పేరుతో బినామీ పాదయాత్ర చేస్తున్నారని ఇటీవల ఆరోపించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలి రోజు నుంచీ చెప్తున్నామన్నారు. ముసుగు వీరులు ఎవరో శాసన సభలోనే చెప్పామని వివరించారు. పాదయాత్రలో వెరిఫికేషన్ చేస్తే.. కేవలం 70 శాతం మంది మాత్రమే అసలు రైతులు అని.. మిగిలిన దొంగ రైతులు పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. ఆ 30 శాతం మంది డ్రామా ఆర్టిస్టుల వల్లే అమరావతి ఉద్యమం కలుషితం అయిందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో కేవలం 70 మందే ఐడెంటిటీ కార్డులు పట్టుకుని వచ్చారంటే ఏమనాలని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా అని.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఆడీ కార్డులు చూపమంటే కల్యాణం మండపం నుంచి బయటకు రాలేదని.. చంద్రబాబు ఒక హిడెన్ అజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు.