Vizag Kidnap Case Issue : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఓ సాదాసీదా రౌడీషీటర్ ఆయన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉంచుకోవడం నమ్మశక్యంగా లేదని పోలీసులు నిజం చెప్పడం లేదన్న అనుమానాలను ఇతర పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని.. అంటున్నారు. ఇది చిన్న విషయం కాదని.. ఓ ఎంపీ భద్రతకు సంబంధించిన అంశమని అంటున్నారు. ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలూ అదే డిమాండ్ చేస్తున్నారు.
అమిత్ షాకు సీబీఐ నారాయణ లేఖ
వైసీపీ ఎంపీ సత్యనారాయణ ఇంట్లో కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ వివిధ రకాల మాఫియాకు, సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని అమిత్ షా చెప్పారని తెలిపారు. అమిత్ షా వచ్చి వెళ్ళిన మూడు రోజులకే వైసీపీ ఎంపీ సత్యనారాయణ ఇంట్లో కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిందన్నారు. ఒక ఎంపీ ఇంట్లో దుండగులు ప్రవేశించి, మూడు రోజులు తిష్ట వేసి గంజాయి మాదక ద్రవ్యాలు వాడారని పేర్కొన్నారు. దుండగులకు, ఎంపీ సత్యనారాయణకు మధ్య అనేక వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదన్నారు. వైసీపీ ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. విశాఖలో అనేక కీలకమైన సంస్థలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు విశాఖ వ్యవహారంలో ఏమి చేయలేరని వెల్లడించారు. కేంద్ర హోం శాఖ నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానికి లేఖ రాసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ
దీని వెనక సూత్ర ధారులు పెద్ద వారే ఉంటారని బిగ్ షాట్స్ ఉంటాయని అంటున్నారు. రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే ఈ కేసులో ల్యాండ్ మాఫియా హస్తం ఉందని చాలా మంది పెద్దలు ఉంటారని అంటున్నారు. దీనిపై విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అమిత్ షా .. విశాఖలో శాంతిభద్రతల పరిస్థితిపై వ్యాఖ్యానించిన గంటల్లోనే ఇది జరిగిందని అందుకే సీరియస్‌గా తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరుతున్నారు. ఎంపీ కుటుంబానికే భద్రత లేదని..ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోతోందని లేఖలో వివరించారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యేదీ అదే డిమాండ్
బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఎన్ఐఏ దర్యాప్తు కావాలంటున్నారు. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమన్నారు. కిడ్నాప్ జరిగితే బంధీలను తీసుకుని వెళతారని, కానీ ఇక్కడ అలా జరగలేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం లేదని, దీనిపై రాష్ట్ర పోలీసులతో కాకుండా, థర్డ్ పార్టీతో ఎంక్వయిరీ వేయాలని, సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ కుమారుడి ఘటన వెనక, కడప, పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అసలు ఈ కిడ్నాప్ కేసులో జరిగింది ఒకటి అయితే.. పోలీసులు చెబుతోంది మరొకటని.. ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలని అంటున్నారు.