Vizag Railway Zone Land Issue :  విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వమే భూమి ఇవ్వడం లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించింది. విశాఖ కలెక్టర్ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. విశాఖకు రైల్వే జోన్ కు ఇవ్వాల్సిన స్థలంపై గత డిసెంబర్ లో చీఫ్ సెక్రటరీ రివ్యూ నిర్వహించారని తెలిపారు. అంతకు ముందు ఉన్న వివాదాలను తొలగించి ల్యాండ్ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని  కలెక్టర్ తెలిపారు. ల్యాండ్ తీసుకోవడానికి అధికారిని పంపాలని రైల్వేని కూడా కోరామన్నారు. అయితే వారే  రాలేదన్నారు. ఎవరైనా వస్తారన్న సమాచారం ఉందని  చెప్పుకొచ్చారు. 


ఈ అంశంపై వైసీపీ స్పందించింది. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి విశాఖలో  52 ఎకరాలు ఇచ్చేలా జీవీఎంసీ, రైల్వే మధ్య 2013లో ఒప్పందం కుదిరిందని వైసీపీ తెలిపింది.  ఆతరువాత 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉంది. మరి అప్పుడు మీ టీడీపీ సర్కారు ఈ భూములను ఎందుకు రైల్వేకు అప్పగించలేదని సోషల్ మీడియాలో ప్రశ్నించింది.  2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భూమికి సంబంధించిన చిక్కుముళ్లు విప్పేసి 2024 జనవరి 2న ఆ స్థలాన్ని రైల్వేకు అప్పగించిందని తెలిపింది.   





 వైసీపీ తాము స్థలాన్ని అప్పగించేశామని చెబుతోంది కానీ.. ఇంకా రైల్వే అధికారులు రాలేదని విశాఖ కలెక్టర్ చెప్పడం విశేషం. అదే సమయంలో రైల్వేజోన్ ను 2019  ఎన్నికలకు ముందు ప్రకటించారు.  అంతకు ముందు జోన్ ప్రకటన లేదు కాబట్టి స్థలం అప్పగింత విషయంపై స్పష్టత లేదు. అయితే జోన్ కోసం 2013లోనే ఒప్పందం జరిగిందని వైసీపీ చెబుతోంది.                


మరో వపై ఈ అంశంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైజాగ్ లో రాజధాని  పేరిట వేల ఎకరాలు కొల్లగొట్టారని జోన్ కోసం అవసరమైన స్థలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.