Viveka Murder Case: వివేకా హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందులలో అందరికీ తెలుసు అని తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసులో సంబంధం ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులు తప్పించుకోలేరన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్ రవీంద్రారెడ్డి. డా.సునీత రాజకీయాల్లోకి రారని డీఎల్ అన్నారు. సునీత, ఆమె భర్త తన ఇంటికి వచ్చారని, కరోనా టైంలో ఆక్సిజన్ సిలెండర్లు ఇచ్చేందుకు పులివెందుల వచ్చారన్నారు. అప్పుడు మా ఇంటికి వచ్చారని డీఎల్ తెలిపారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన వైసీపీ నేతల(Ysrcp Leaders) ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని డీఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శించారు.


అవినాష్ రెడ్డి తప్పించుకోలేరు : డీఎల్ 


"నాకు తెలిసినంత వరకు అవినాష్‍రెడ్డి తప్పించుకోలేడు. నాకు సీబీఐ(CBI) మీద ప్రగాఢ నమ్మకం ఉంది. పాత్రధారులు, సూత్రధారులు జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి హత్య చేశారని తేలితే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎప్పుడూ వివేకా దగ్గర ఉండేవారు. గంగిరెడ్డికి నేను ఫోన్ చేస్తే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి దేవిరెడ్డి శంకర్రెడ్డికి ఎర్ర గంగిరెడ్డి టచ్‍లో ఉన్నాడు. వివేకా పీఏ కృష్ణారెడ్డి సైతం శంకర్ రెడ్డికి టచ్‍లో ఉన్నాడు. ఇది తెలియక కృష్ణారెడ్డితో సునీత కంఫ్లైంట్ ఇప్పించారు. శంకర్ రెడ్డి ఏం చెబితే అది కంప్లైంట్‍లో కృష్ణారెడ్డి రాసిచ్చారు. సునీత, రాజశేఖర్ ను పక్కన పెట్టుకుని చంద్రబాబు హత్య చేయించారని జగన్ ఆరోపించారు." అని డీఎస్ రవీంద్రారెడ్డి అన్నారు. 


కోడికత్తి అడ్డుపెట్టుకుని అధికారంలోకి 


వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ వివేకానంద రెడ్డిని చంపారని ఓ పత్రికలో రాయడం సిగ్గుచేటని రవీంద్రారెడ్డి విమర్శించారు. కోడి కత్తి అడ్డుపెట్టుకుని రాజకీయాలు వేసిన వ్యక్తి జగన్ అన్నారు.  జగన్‍కు డబ్బుతో పనిలేదు, ప్రజలకు సేవ చేస్తారని ఆశించామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. 


సజ్జలపై సంచలన ఆరోపణలు 


సజ్జల రామకృష్ణా రెడ్డి పైనా సంచలన ఆరోపణలు చేశారు డీఎల్.  ఓ సాధారణ విలేఖరి రూ.వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. పది మంది బ్రోకర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. కొడుకుతో హైదరాబాద్‍లో పరిశ్రమలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. సునీతపై సజ్జల అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.