తెలంగాణ రాష్ట్ర సమితిలో ( TRS ) ముగ్గురు కీలక నేతలు ఇప్పుడు కలకలం రేపుతోంది. కొంత కాలంగా హైకమాండ్ వారిని పట్టించుకోకపోతూండటం.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సూచనలు కనిపిస్తూండటంతో వారు ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని తొందరపడుతున్నట్లుగా కనిపిస్తోంది.  వారి అనుచరులు సమావేశం అయి తమ నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్‌లో సెగలు ప్రారంభమయ్యాయి. 


టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయిన ముగ్గురు నేతల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు. ( Jupalli Krishna Rao ) ఆయన కాంగ్రెస్‌లో మంత్రిగా పని చేశారు. తర్వాత టీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. కానీ గత ఎన్నికల్లో  కొల్లాపూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వతా టీఆర్ఎస్ పక్కన పెట్టింది.  మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ అభ్యర్థులను కాకుండా సొంత వారిని నిలబెట్టి గెలిపించుకున్నారు. దీనిపై కేసీఆర్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది.  అయితే ఆయన పార్టీ నుండి బయటకు వెళ్లలేదు.  వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా అవకాశం దక్కతుందని క్లారిటీ లేకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే చర్చలు జరిగాయని ఆయన అనచరులు మీడియాకు చెబుతున్నారు. 


ఇక ఖమ్మం జిల్లాలో ఇద్దరు టీఆర్ఎస్ సీనియర్లు కూడా అదే బాటలో ఉన్నారు. తాము వెనక ఉండి తమ అనుచరులతో సమావేశాలు పెట్టిస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ( 
Tummala Nageswar Rao ) వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడం కష్టమేనని తేలిపోయింది. ఇప్పటికీ హైకమాండ్ నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. తాను పోటీ చేయడానికి సిద్ధమని ఆయన చెబుతున్నారు. ఆయన నియోజకవర్గం పాలేరులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. దీంతో  తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. 


అచ్చంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ( Ponguleti Srinivas Reddy )కూడా అదే పరిస్థితి. ఆయన కూడా పార్టీ మార్పుపై సంకేతాలిస్తున్నారు. ఆయనపై టీఆర్ఎస్ హైకమాండ్‌కు సరైన అభిప్రాయం లేదు. గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారన్న రిపోర్టులు హైకమాండ్ వద్ద ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ హామీ ఉంటే తాను టీఆర్ఎస్‌లోనే ఉంటానని చెబుతున్నారు. లేకపోతే ఆయన కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు.