IND vs SL 2nd Test, Shreyas Iyer: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 59.1 ఓవర్లకు 252 పరుగులకు ఆలౌటైంది. యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (92; 98 బంతుల్లో 10x4, 4x6) తన కెరీర్లోనే ది బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా హనుమ విహారి (31; 81 బంతుల్లో 4x4), రిషభ్ పంత్‌ (39; 26 బంతుల్లో 7x4) ఫర్వాలేదనిపించారు. లంకలో ఎబుల్దెనియా, ప్రవీణ్‌ జయ విక్రమ చెరో 3 వికెట్లు తీశారు. ధనంజయ డిసిల్వాకు 2 వికెట్లు దక్కాయి.


ఏంటీ టర్నింగ్‌?


టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు కొద్దిసేపటికే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ (4) నోబాల్‌కు రనౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 10. మరికాసేపటికే రోహిత్‌ శర్మ (15)ను ఎంబుల్దెనియా పెవిలియన్‌ పంపించాడు. విచిత్రంగా బెంగళూరు పిచ్‌ విపరీతమైన టర్న్‌కు అనుకూలిస్తోంది. మొహాలి పిచ్‌తో పోలిస్తే రెండు డిగ్రీలు ఎక్కువగా బంతి టర్న్‌ అవుతోంది. ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్‌ అవుతోంది. దాంతో బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. హనుమ విహారి (31; 81 బంతుల్లో 4x4), విరాట్‌ కోహ్లీ (23; 48 బంతుల్లో 2x4) కుదురుకున్నట్టే కనిపించినా ఆడక తప్పని బంతులేసిన లంక స్పిన్నర్లు వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపించారు.


శ్రేయస్‌ను ఆపేదెవరు?


కష్టాల్లో పడిన టీమ్‌ఇండియా రిషభ్ పంత్‌ (Rishabh Pant), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఆదుకున్నారు. స్పిన్‌ను నిలకడగా ఆడితే ఔటవుతుండటంతో పంత్‌ దూకుడుగా ఆడాడు. వరుస పెట్టి బౌండరీలు కొట్టాడు. కీలక సమయంలో అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటి నుంచి అయ్యర్‌ అమేజింగ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. కఠిన పిచ్‌పై అతడు బ్యాటింగ్‌ చేసిన తీరు మాత్రం అద్భుతం. టర్న్‌ను చక్కగా ఎదుర్కొంటూనే లూజ్‌ బాల్స్‌ పడితే బౌండరీకి పంపించాడు. అవతలి ఎండ్‌లోని బ్యాటర్లు కంగారు పడుతోంటే అతడు మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. బ్యాక్‌ఫుట్‌తో పాటు నిలబడి సిక్సర్లు బాదేశాడు. 54 బంతుల్లోనే 50 పరుగులుపూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి సిక్సర్లు కొట్టాడు. టెయిలెండర్లను అడ్డుపెట్టుకొని టీమ్‌ఇండియా స్కోరును 250 దాటించాడు. అయితే సెంచరీకి ముందు స్టంపౌట్‌ అయ్యాడు. నిజానికి శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ డబుల్‌ సెంచరీతో సమానమని విశ్లేషకులు అంటున్నారు.