Vishnu Meets AP CM : ఢిల్లీలో బీజేపీ కోసం ప్రచారం చేసేందుకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడును ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అధికారిక నివాసంలో కలిశారు. చాలా బిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు విష్ణువర్దన్ రెడ్డికి సమయం కేటాయించి ఢిల్లీ ఎన్నికల తీరు తెన్నులపై మాట్లాడారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్నికల సభపై చంద్రబాబు గారు సంతృప్తి వ్యక్తం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల కోసం జాతీయ పార్టీ ఆదేశాల మేరకు గత రెండు వారాలుగా సమన్వయకర్తగా పని చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. ఈ అంశంపైనా చంద్రబాబు మాట్లాడారు. బిజీ షెడ్యూల్స్ ఉన్నా తెలుగు దేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అందరిని డిల్లీ ఎన్నికల్లో పనిచేసేందుకు పంపడమే కాకుండా వారు సైతం జాతీయ పార్టీ ఆహ్వానాన్ని గౌరవించి బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిబింబించడమే కాకుండా ఢిల్లీలో తెలుగు సమాజానికి ప్రగతిపరమైన రాజకీయ శక్తులకు మద్దతు ఇవ్వడానికి మంచి అవకాశంగా ఉంటుందని చంద్రబాబు ఢిల్లీలో ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ , తెలుగుదేశం పార్టీలు ఆంధ్ర అభివృద్ధిలో నేడు భాగస్వాములుగా ముందుకు సాగుతున్నాయని అదే తరహాలో ఢిల్లీకి నరేంద్రమోదీ సహకారం అవసంర ఉందన్నారు. అందుకే ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం కీలకమని చంద్రబాబు ఢిల్లీ ఓటర్లకు సందేశం ఇచ్చారు. NDA లో కీలకమైన భాగస్వామి పార్టీగా తెలుగుదేశం డిల్లీ ఎన్నికలలో పాల్గొనడం కచ్చితంగా బీజేపి గెలుపుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకే అవకాశం ఇస్తారని.. ఆ వాతావరణం కనిపిస్తోదంని చంద్రబాబు విశ్లేషించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఈ క్రమంలో ఎన్డీఏలోని కీలక పార్టీల నేతలంతా ప్రచారం చేస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేతలు, యువ నేతల్ని ఎన్నికలను సమన్వయం చేసేందుకు కీలక బాధ్యతలు అప్పగించారు. విష్ణువర్ధన్ రెడ్డి గతంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కీలకంగా పని చేశారు. ఇప్పుడు ఢిల్లీలోనూ తెలుగు ప్రజల ఓట్లు బీజేపీకి పడేలా సమన్వయం చేసుకుంటున్నారు.