YSRCP Bus Yatra: ఏపీలో ఎన్నికలకు అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యూల్ వివరాలను మంత్రి ప్రకటించారు. 
 
సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 26 నుంచి అన్ని ప్రాంతాల్లో  175 నియోజకవర్గాలల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. మూడు విడుతలుగా బస్సు యాత్ర సాగుతుందన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రతిపక్షాలు చేసిన అవినీతిని ఈ బస్సుయాత్రలో ప్రజలకు తెలియజేసేలా కార్యచరణ రూపొందించినట్లు చెప్పారు. మళ్లీ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎందుకు కావాలనే అంశంపై ప్రజలకు వివరిస్తామనన్నారు. 26వ తేదీన ఇచ్ఛాపురం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. 


పరిపాలన రాజధానిగా విశాఖపట్నం కచ్చితంగా అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని నిర్ణయించినట్లే చెప్పారు. ఇక్కడి నుంచే సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్థానికుడు అయితే ఇక్కడి ప్రజల బాధ ఆయనకు తెలుస్తుందన్నారు. ఇక్కడ స్థానికులు ఎవ్వరు రాజధాని వద్దనరని అన్నారు. గంటా ఈ ప్రాంతం వ్యక్తి కాదని, ఆయనకు  ఇక్కడి ప్రజల బాధలు తెలియవన్నారు. 


రాష్ట్రంలో మరో సారి వైసీపీ ప్రభుత్వం వస్తుందని బొత్స అన్నారు. జగన్ మోహన్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. నిన్నటి సభలో సీఎం జగన్‌ వాస్తవాలే మాట్లాడారని, వ్యక్తి గత దూషణలు చేయలేదన్నారు. వ్యక్తిగతంగా దూషించడం రాజకీయ సంప్రదాయం కాదని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను సీఎం జగన్ వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. కేవలం సంప్రదాయాలు గురించి వివరించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎవరినైనా కలవొచ్చని, అమిత్‌షాను కాకపోతే అమితాబ్‌ను కలిసినా మాకు అభ్యంతరం లేదని మంత్రి అన్నారు. 


రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  


నిబంధనలు ప్రకారమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. చట్ట ప్రకారమే చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారని, ఇందులో వ్యక్తి గతం ఏమీ లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,  బాబు కుటుంబ సభ్యుల సూచనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే అచరిస్తామని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే పార్టీ వైసీపీయే అని, విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. 


సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్‌ ఇదే
అక్టోబర్ 26- ఇచ్చాపురం, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న ఎస్ కోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లిలో బస్సు యాత్ర జరుగనుంది.