YSRCP MLC Vamsikrishna Srinivas to join Janasena :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస పోతారనిప్రచారం జరుగుతున్న  నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా గుప్పుమంది. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ నిరాకరించారు . కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించి మేయర్ ను చేస్తామని బుజ్జగించారు. కార్పొరేటర్ గా పోటీ చేయించారు కానీ..మేయర్ పదవి కూడా ఇవ్వలేదు.  దాంతో ఆయన అసంతృప్తికి గురైనా..  మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు జనసేనలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 


నేడో రేపో పవన్ తో భేటీ కానున్న వంశీ కృష్ణ శ్రీనివాస్               


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడకు  రానున్నారు.  కాకినాడలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నట్లు సమాచారం. తన వర్గం కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది.  గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు.


ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వంశీ కృష్ణ                                         


వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ప్రజారాజ్యంలో పని చేసిన సమయంలోనే పవన్ కల్యాణ్‌తో  పరిచయాలు ఉన్నాయి. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో .. ఆ పార్టీ ఉనికి కోల్పోవడంతో చివరికి వైసీపీలో చేరారు. ఆయనకు 2014లో మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టిక్కెట్ కేటాయించలేదు. 


మేయర్ పదవి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం జగన్                        


మేయర్ పదవిని ఇవ్వలేకపోవడంతో  ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయనకు విశాఖ రాజకీయాల్లో ఎలాంటి  ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎమ్మెల్సీ అయినా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో ఆయన మాట వినేవారు లేరు. దీంతో జనసేనలో చేరితే పొత్తులో భాగంగా ఎక్కడైనా సీటు లభించే అవకాశం ఉందని.. ఆ  పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు.