Dharmana Krishna Das: రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయా ప్రాంతాలలో గ్రూపుల గోల వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. నాయకులను సమన్వయ పరుచుకుని ముందుకు సాగడంలో ఎమ్మెల్యేలు విఫలం అవుతున్నచోట అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న నేతలకు ఎమ్మెల్యేలు మద్దతునిస్తూ పార్టీ కోసం పనిచేసిన మిగిలిన నాయకులను విస్మరిస్తుండడంతో గ్రూపులు తయారవుతున్నాయి. గ్రూపులకి చెక్ చెప్పి నాయకులమద్య సయోధ్య కుదిర్చే నాథుడే కరువవడంతో విభేదాలురచ్చకెక్కుతున్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో అసమ్మతి నేతలుగా ముద్రపడ్డ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. 2024ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ కి టిక్కెట్ ఇస్తే పనిచేసేది లేదనివారంతా అల్టిమేటం జారీ చేశారు. కొత్తవారికి టిక్కెట్ ఇస్తే అంతాకలిసి పనిచేసి గెలిపించుకుంటామని స్పష్టం చేసారు. నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలకి చెందిన కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.
నరసన్నపేట నియోజకవర్గంలో అధికార వైకాపాలో గ్రూపుల గోల పతాక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యవహార శైలిని గత కొంతకాలంగా తప్పుపడుతున్న నాయకులు అంతాఇన్నాళ్ళు పార్టీ పట్ల గౌరవం, క్రమ శిక్షణ ఉండడంతో మౌనంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ వారికి తగిన గౌరవందక్కకపోవడం, సొంత వారి నుంచే ఇబ్బందులు ఎదురవడంతోఇన్నాళ్ళు మౌనంగా ఉంటూ దాసన్నను వ్యతిరేకిస్తున్న వారంతా ఇప్పుడు బయటకు వచ్చి ఆయన తీరును ఆక్షేపిస్తున్నారు. ఈక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంగా అసమ్మతి నేతలుగాముద్రపడ్డ వైకాపాలోని కీలక నేతలంతా సోమవారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలోసారవకోట ఎంపిపి చిన్నాల కూర్మినాయుడు, జలుమూరు జడ్పీటిసి ప్రతినిధి మెండ రాంబాబు, నరసన్నపేట మండలానికి చెందిన వైకాపా నాయకులు ముద్దాడ బాలభూపాల్నాయుడు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ బావాజీ నాయుడు, పోలాకి మండలం నుంచి మాజీ డిసిసిబి చైర్మన్ డోల జగన్, మాజీ ఎంపిపి తమ్మినేని భూషణలతో పాటు నియోజకవర్గంలోని వివిద ప్రాంతాలకి చెందిన ఎంపిటిసిలు,సర్పంచ్ లు కూడా పాల్గొన్నారు. సుమారు 200 నుంచి 250 మంది ఈ సమావేశానికి హాజరుకాగా వారంతా కూడా బహిరంగంగానే తమ అసమ్మతిని తెలిపారు. గత ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారంతా ఇప్పుడు ఆయనకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వవద్దని వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. నాలుగు మండలాలకి చెందిన అసంతృప్త నేతలు అంతా కూడా ఇదే అభిప్రాయాన్ని సమావేశంలో వ్యక్తం చేశారు.
కొత్తవారికి టిక్కెట్ ఇచ్చినా ఆ అభ్యర్ధి గెలుపుకోసం ఐక్యంగా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ధర్మాన కృష్ణదాస్ కి టిక్కెట్ ఇస్తే మాత్రం తాము సహకరించబోమని వారంతా తేల్చి చెప్పారు. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తాము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఈ సమావేశం పూర్తైన తర్వాత వివరాలను హాజరైన నాయకులతో కలిసి సారవకోట ఎంపిపి చిన్నాల కూర్మినాయుడు మీడియాకి వెల్లడించారు. ధర్మాన కృష్ణదాస్ వ్యవహార శైలి వల్ల నరసన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందన్నారు. ఆయనకే టిక్కెట్ ఇస్తే పార్టీ దెబ్బతింటుందన్నారు.
వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థికి నరసన్నపేట నుంచి టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే తమకి అభిమానమని, పార్టీ పట్ల గౌరవం ఉందని, ఇన్నాళ్లు క్రమ శిక్షణకి కట్టుబడి ఉన్నామన్నారు. వైకాపాకి నష్టం వాటిల్లే ప్రమాధం ఉండడంతో ఇప్పుడు బయటకి వచ్చి ధర్మాన కృష్ణదాస్ కి టిక్కెట్ ఇవ్వవద్దని కోరుతున్నామన్నారు. అధిష్టానం తమ నిర్ణయాన్ని గౌరవిస్తుందని భావిస్తున్నామని లేని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని కూర్మినాయుడు స్పష్టం చేశారు.