Venkaiah Naidu Comment On Present Political Leaders : బూతులు మాట్లాడే రాజకీయ నేతలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య తాజా రాజకీయ పరిస్థితులు, నేతలు మాట్లాడే తీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే రాజకీయ నాయకుల్లో హుందాతనం పోతుందని, బూతులు మాట్లాడుతూ రాజకీయాల విలువను తగ్గిస్తున్నారన్నారు.


ఓటుతో బుద్ధి చెప్పాలి 
బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లోనే  ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటుల్లో కొంతమంది అపహస్య పనులు చేస్తున్నారని, చూడకుండా ప్రశాంతంగా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని, మాతృభాష తల్లి వంటిదని పేర్కొన్నారు. మాతృభాష కళ్లు లాంటిది అయితే, పర భాషలు కళ్లద్దాలు వంటివి అని, కళ్లు ఉంటేనే కళ్లద్దాలు అవసరం ఉంటుందన్నారు. విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారని, తమ పిల్లలను విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం విలువలతో కూడిన విద్య తగ్గుతోందని, ఇది మంచిది కాదన్న భావనను వెంకయ్య నాయుడు వ్యక్తం చేశారు. విలువలతో కూడిన విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. 


భారత్ వైపు చూస్తూ ఉన్న ప్రపంచం


ఒకప్పుడు విశ్వ గురువుగా ప్రసిద్ధిగాంచిన భారత వైపు ప్రపంచం మళ్లీ చూస్తూ ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశంలో ఉన్న మేథో శక్తి వల్లే మళ్లీ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందన్నారు. భగవంతుడు తనకు ఏం కావాలని వరమడిగితే, విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానన్నారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువుని మించింది గూగుల్ కాదని, గురువులకు గౌరవాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు. పిల్లలతో తల్లిదండ్రులు కొంత సమయాన్ని గడపాలని, సమయం విలువ, బంధాల విలువ వారికి తెలియజేయాలని వెంకయ్య నాయుడు సూచించారు.