Nadella Manohar:  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..? అని  ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ  చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.  గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థ లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.. వాలంటీర్ ల వ్యవస్థకు బాధ్యులు ఎవరు..? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తి గత సమాచారం తీసుకుని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు.. అలా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? ఇవే ప్రశ్నలు పవన్ కల్యాణ్‌ అడిగారు.. ఇలా ప్రశ్నిస్తే వాలంటీర్ ల వ్యవస్థను దూషించినట్లా? అని మండిపడ్డారు. 


లక్ష మంది వాలంటీర్లు ఎవరో రికార్డులు కూడా లేవు ! 


సీఎం వైఎస్‌ జగన్ తన సైన్యం అని చెప్పుకునే, 2,55,461 మంది వాలంటీర్లలో 1,02,836 వాలంటీర్ల డేటా అసలు రికార్డులలోనే లేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.  వాలంటీర్‌ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి పవన్‌ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ఏటా రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానిలో రూ. 617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారు. ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా?అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? వీటికి సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లలో   21 వేలమంది పీజీ చేసిన వారు ఉన్నారన్నారు.  


డేటా ఎవరికో ఎందుకు ఇస్తున్నారు ? 


ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం అని ప్రకటించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు వాలంటీర్లకు నాయకుడు ఎవరు? వారికి అన్ని అధికారాలు ఎందుకు? ప్రజల వివరాలు తీసుకెళ్లే ఎక్కడో పెట్టేస్తున్నారు.. ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఏంది అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇదే సమయంలో.. పవన్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆందోళనలు నిర్వహించిన విషయం విదితమే.. ఇదే సందర్భంలో పోలీస్‌ స్టేషన్లలో సైతం ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. అయితే, తాను మొత్తం వాలంటీర్‌ వ్యవస్థను తప్పుబట్టడం లేదని.. వాలంటీర్లలో ఉన్న కొందరు క్రిమినల్స్‌ గురించేనని.. అయినా అందరి డేటాను ఎవరి చేతిలోనో పెట్టాల్సిన అవసరం ఏంటి? అని  జనసేన ప్రశ్నిస్తోంది. 


పవన్ పై కోర్టులో కేసు వేసిన ఏపీ ప్రభత్వం 


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం క్రిమినల్‌ కేసు (Criminal Case) దాఖలు చేసింది. ప్రభుత్వం తన మానసపుత్రులుగా చెప్పుకుంటున్న వలంటీర్లపై పవన్ కల్యాణ్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపించింది. వలంటీర్లను కించపరిచేలా, వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు దాఖలు చేసింది. దీనిని జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్‌ కల్యాణ్ విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులిచ్చారు.