Riteish Deshmukh as Chhatrapati Shivaji Maharaj: హీరోలుగా సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారిలో చాలామంది తమ కెరీర్‌లో ఒక్కసారైన మైక్రోఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేయాలని అనుకుంటారు. ఇప్పటికే ఎందరో హీరోలు.. అలా ఒక్కసారైనా డైరెక్షన్‌లో తమ లక్‌ను పరీక్షించుకున్నవారే. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి మరో హీరో కూడా యాడ్ అయ్యాడు. తనే రితేష్ దేశ్‌ముఖ్. ఇప్పటికే ‘వేద్’ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించి డైరెక్టర్‌గా తన మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు రితేష్. ఇప్పుడు మరోసారి భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడట. అది ఒక బయోపిక్ అని బాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.


‘మజిలీ’ రీమేక్‌తో..


ఛత్రపతి శివాజీపై బయోపిక్‌ను తెరకెక్కించాలని రితేష్ దేశ్‌ముఖ్ సన్నాహాలు చేస్తున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2022లో మొదటిసారిగా దర్శకుడిగా మారి ‘వేద్’ అనే మరాఠీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రితేష్. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన ‘మజిలీ’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిందే ‘వేద్’. తెలుగులో సమంత చేసిన పాత్రను మరాఠీలో జెనీలియా చేసింది. ఇక చాలాకాలం తర్వాత రియల్ లైఫ్ కపుల్ అయిన రితేష్, జెనీలియా కలిసి నటించడంతో ‘వేద్’పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే 2022లో విడుదలయిన మరాఠీ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘వేద్’. డైరెక్టర్‌గా మొదటి ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఏకంగా ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడట రితేష్.


దర్శకత్వం మాత్రమే కాదు..


‘‘ఇది కేవలం ఒక సినిమా కాదు. రితేష్ దేశ్‌ముఖ్‌కు ఒక ఎమోషన్ లాంటిది. తన ప్యాషన్ ప్రాజెక్ట్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని ఒక రూపంలోకి తీసుకురావడానికి రితేష్.. శాయశక్తుల ప్రయత్నించడానికి సిద్ధమయ్యాడు. కేవలం ఈ సినిమాను తను డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఇందులో ఛత్రపతి పాత్రలో తానే స్వయంగా నటించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు రితేష్’’ అని సన్నిహితులు చెప్తున్నారు. ఈ సినిమా హిందీ, మరాఠీలో కూడా తెరకెక్కనుందట. జియో స్టూడియోస్, ముంబాయ్ ఫిల్మ్ కంపెనీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.


తనకు బాగా తెలుసు..


నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌తో మరాఠీలో డెబ్యూ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది మరాఠీ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. అజయ్, అతుల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక చిత్రం కావడంతో ప్రేక్షకులు దీని నుండి ఏం ఆశిస్తారో రితేష్‌కు బాగా తెలుసు. ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని రితేష్ నిర్ణయించుకున్నాడు’’ అని సన్నిహితులు తెలిపారు. డైరెక్షన్‌లో ఒకే సినిమా అనుభవం ఉన్న రితేష్.. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్తాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: చెక్ బౌన్స్ కేసులో దర్శకుడికి రెండేళ్లు జైలుశిక్ష, రూ.2 కోట్లు ఫైన్