రుషికొండపై చేపడుతున్న నిర్మాణం సెక్రటేరియట్ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయం అని శనివారం (ఆగస్టు 13) వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌పై విమర్శలు రావడంతో తాజాగా ఆదివారం ఉదయం వెనక్కి తగ్గింది. 


‘‘మా అధికారిక ట్విటర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు’’ అని వైసీపీ పేర్కొంది. తర్వాత కాసేటిలో ట్వీట్ ను డిలీట్ చేశారు.


దీనిపై టీడీపీ ఎద్దేవా చేయగా, ‘‘వాస్తవానికి మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి, అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది, కానీ మీలాగా మీ నాయకుడు చంద్రబాబు లాగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టే తప్పుడు కార్యక్రమాలు మేమెప్పుడు చేయలేదు, చేయబోము కూడా. ఇదీ మా నాయకుడు జగన్ మాకు నేర్పిన లక్షణం, ఇదీ మా విశ్వసనీయత’’ అని ట్వీట్ చేశారు.