ఒక ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులతో రుషికొండపై నిర్మాణాలు చేస్తుంటే విపక్షాలకు కలుగుతున్న అభ్యంతరాలు ఏంటని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. ప్రస్తుతం చేస్తున్న నిర్మాణాలకు సమీపంలోనే రామానాయుడు స్టూడియో, టీటీడీ దేవాలయం, వెల్ నెస్ సెంటర్ ఉన్నాయని, అవన్నీ కొండపైనే నిర్మించారని అన్నారు. విశాఖపట్నం రాజధాని అవుతున్నందున అక్కడ భూముల లభ్యత తక్కువగా ఉందని, అందుకే కొండలపై నిర్మాణాలు చేయడం అక్కడ సహజమేనని అన్నారు. గతంలో కూడా రుషికొండపై నిర్మాణాలు చేపట్టారని మంత్రి గుర్తు చేశారు. విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్‌లో మంత్రి గుడివాడ అమర్ నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఒక ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే ధ్వంసం చేస్తుందని ఎలా అంటారని గుడివాడ ప్రశ్నించారు. విశాఖపట్నం పాలనా రాజధాని అన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అక్కడ నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు. వాటిని భవిష్యత్తులో సీఎం ఇంటి కోసమో, సీఎంవో కోసమో, ఇతర శాఖల కార్యాలయానికి వాడతారా అనేది తదుపరి నిర్ణయమని అన్నారు. 


ఆ నిర్మాణాల వద్దకు ఇతరులను ఎందుకు అనుమతించాలని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లి తప్పుడు ప్రచారం చేసే వారిని లోనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు. రుషికొండ నిర్మాణాలను రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధిపొందాలనుకునేవారిని ఉపేక్షించబోమని అన్నారు. ప్రభుత్వం నిషేదం ఉంటుందని, దాన్ని కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. 


ఆ భూమి నాదని నిరూపిస్తే అందరికీ పంచేస్తా
విస్సన్నపేటలోని 600 ఎకరాలు మంత్రి గుడివాడ అమర్ నాథ్ వే అని నిరూపిస్తే ఇక్కడున్న ప్రతిఒక్కరికీ ఎకరం చొప్పున పంచుతానని విలేకరులను ఉద్దేశించి అన్నారు. మిగిలిన భూమి జనసేనకు ఇచ్చేస్తానని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూమిని అమర్ నాథ్ రాయించుకున్నారని గానీ, కబ్జా చేశారని గానీ నిరూపిస్తే మొత్తం భూమిని వదులుకుంటానని అన్నారు.


పవన్ కల్యాణ్ కు చంద్రబాబు డాడీ అని గుడివాడ ఎద్దేవా చేశారు. మళ్లీ డాడీని ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంతేకానీ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఉద్దేశం వారికి లేదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో టీడీపీ నుంచి కోవర్టులను చంద్రబాబు అందులోకి పంపించారని, ప్రజారాజ్యాన్ని చంద్రబాబే నాశనం చేశారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుకు మళ్లీ ఊడిగం చేస్తున్నారని అన్నారు. సొంత జెండా పక్కన పడేసి టీడీపీ అజెండా కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.


గీతం అక్రమాలు కనబడవా? - మంత్రి
‘‘గత 4 రోజులుగా జగన్ మీద విషం కక్కడం తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. ఆయన పర్యటన సందర్బంగా రుషికొండలో జరిగిన పనులకి ఆయన మాటలకూ సంబంధం లేదు. పక్కనే ఉన్న గీతం కాలేజీ అవకతవకలు మీకు కనపడలేదా? గీతం అధినేత మీ డాడీకి అత్యంత ఆప్తుడు, మీ తమ్ముడికి తోడల్లుడు చేస్తున్న అక్రమాలు కనపడలేదా? హైదరాబాద్ లో రామోజీ స్టూడియో, మీ అన్నయ్య గారి ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు కొండల మీద కాదా? మీరు అక్కడ కట్టుకోవచ్చు, మేము ఇక్కడ ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కడితే తప్పా? 


మాట్లాడితే జగన్ మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అంటున్నారు. కావాలంటే మీ అత్తారిల్లు అయిన రష్యా, అమెరికా అధ్యక్షుడికి కంప్లైంట్ ఇచ్చుకో. నువ్వు, మీ డాడీ కలిసి ప్రచారం చెయ్యచ్చు కదా, విడివిడిగా ప్రచారం చెయ్యడం ఎందుకు? మీ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీకి అన్యాయం చేసింది ఎవరు మీ డాడీ చంద్రబాబు కాదా? ప్రజారాజ్యం సమయంలో మీ అన్నయ్య మీద, పార్టీ మీదా మీ డాడీకి ఆప్తులు అయినా రామోజీ రాయించిన వార్తలు మర్చిపోయావా?’’ అని గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు.