ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రుషికొండపై రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లుగా తొలిసారిగా స్పష్టం చేసింది. కొండను కొంత మేర తొలిచి అక్కడ ప్రస్తుతం చేస్తున్న నిర్మాణాలు సచివాలయం కోసమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రకటన చేసింది. అయితే, ఇన్నాళ్లు అక్కడ చేపడుతున్న నిర్మాణాలు గవర్నమెంట్ ఆఫీసుల కోసం కాదని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి టూరిస్ట్ ప్రాజెక్టులు చేపడుతున్నామని గతంలో వెల్లడించింది. అయితే, తాజాగా అందుకు భిన్నంగా ఆ నిర్మాణాలు సచివాలయం కోసమే అని చేయడం చర్చనీయాంశం అయింది.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్‌ నుంచి శనివారం (ఆగస్టు 12) రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ట్వీట్‌ చేశారు. రుషికొండ విషయంలో టీడీపీ చేసిన ఓ వ్యంగ్య విమర్శకు సమాధానంగా ఈ ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్‌.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారని అన్నారు. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తూ ఉందని.. ఇది చూస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదని అపిస్తోందని వైసీపీ ట్వీట్ చేసింది.


‘‘విశాఖను దోచుకుంది టీడీపీ నాయకులేనని సాక్షాత్తూ గత మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనలేదా? టీడీపీ నాయకులు దోచుకున్న 450 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు వైయస్ జగన్ గారు. దాని మీద మీ పార్టీ దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.






టీడీపీ చేసిన వ్యంగ్యపు ట్వీట్ ఏంటంటే..


రుషికొండను తవ్వేసి నాశనం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీమ్ తరహాలో ఒక వీడియోను టీడీపీ విడుదల చేసింది. రుషికొండపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు ఓ సినిమా డైలాగ్ ను ఆపాదించింది. జులాయి సినిమాలో విలన్ కోటా శ్రీనివాసరావు చెప్పే డైలాగ్ అది. ‘‘రుషికొండ నుంచి భీమిలీకి వెళ్లే దారిలో రోడ్డు కొంచెం మలుపు తిరిగి ఉందయ్యా. అమ్మాయి నడుం లాగా. కరెక్టుగా అక్కడ పదెకరాల బిట్టు మనకి ఉంది బిట్టూ. అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ల కింద ఉన్నట్టు ఉంటది. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా’’ అని ఆ డైలాగ్ ఉంది. దాన్ని టీడీపీ సీఎం జగన్‌కు ఆపాదించింది.