YCP Bike Rally: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కోసం ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో విశాఖపట్నం వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖను రాజధాని చేయాలంటూ గంధవరం నుంచి చోడవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో మేధావులు, టీచర్లు సహా వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చోడవరంలోని కొత్తూరు జంక్షన్ లో మానవహారం చేపట్టారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేందేందుకు ఆస్కారం ఉంటుందని వారు అన్నారు. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి లాభమే తప్పా.. నష్టం లేదని తెలిపారు.  


'3 రాజధానులు కావాల్సిందే'


ఈ ఆందోళనల్లో పాల్గొన్న పీఎస్ పేటకు చెందిన సిటిమి శెట్టి శ్రీను అనే వ్యక్తి.. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని.. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. మానవహారం చేస్తుండగా.. మధ్యలో బైక్ ను లాక్కొచ్చి తనపై పెట్రోల్ పోసుకొని బైక్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న వారు సిటిమిశెట్టి శ్రీనును పక్కకి లాగారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.


 ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన శ్రీనును స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యమ్మ వచ్చి ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ కార్యకర్త శ్రీను పరామర్సించారు. ప్రజల డిమాండ్ లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రజలు ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని కోరారు.


'విశాఖ పర్యటనపై పవన్ పునరాలోచించుకోవాలి'


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై పునరాలోచించాలని ఉత్తరాంధ్ర నాన్-పొలిటికల్ జేఏసీ వైస్ -ఛైర్మన్ దేవుడు మాస్టారు సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి-రాజధాని డిమాండ్ తో ముడిపడి ఉందని అన్నారు. రైతులు భూములు కోల్పోతే నష్ట పరిహారం కోసం ఉద్యమించాలి గానీ.. విశాఖకు రాజధాని వద్దు అని యాత్ర చేయడం ఏమిటని ఆయన పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. కావాలంటే అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ సీఎం వద్దకు తాము తీసుకెళతామని వెల్లడించారు. అమరావతి రైతుల యాత్ర వెనక కుట్ర దాగి ఉందని ఈ సందర్భంగా ఆయన ఆరోపణలు చేశారు.


పవన్ కల్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని.. విశాఖ పర్యటనపై ఆయన మరోసారి ఆలోచించుకోవాలని కోరారు. అలాగే పవన్ కల్యాణ్ విశాఖ ఘర్జనకు ఆటంకం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ ప్రజల మంచి కోరే జనసేనాని రాజధానుల విషయం సరైన నిర్ణయం తీసుకొని విశాఖ ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నట్లు తెలిపారు.