YSRCP Leader Arrest: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ వైసీపీ లీడర్. స్వచ్ఛంద్రప్రదేశ్  కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌గా పనిచేసి ఓ గొప్ప పోజిషన్‌లో ఉన్నా..చేతివాటం ప్రదర్శించడం ఆపలేదు. ఓ బైక్‌ దొంగతనం చేసి దాన్ని విక్రయిస్తూ  అడ్డంగా దొరికిపోయాడు.


దొంగగా మారిన స్వచ్ఛంద్ర డైరెక్టర్
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చెందిన ఓ వైసీపీ నాయకుడు దొంగతనం చేస్తూ కటకటాలపాలైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. చింతపల్లి మండలానికి చెందిన షేక్‌మీరా పదేళ్ల క్రితం ఐటీడీఏ కాఫీ ప్రాజెక్ట్‌లో పని చేసేవాడు. అక్కడ అవినీతికి పాల్పడి 2 లక్షల రూపాయల వరకు దోచుకోవడంతో అతన్ని పనిలో నుంచి తీసేశారు. అప్పటి నుంచి షేక్‌మీరా వైసీపీలో క్రీయాశీలకంగా తిరుగుతున్నాడు. దీంతో అప్పటి  వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆయన్ను స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి సిఫార్సు చేశారు. ఆమె సిఫార్సు మేరకు షేక్‌మీరాను డైరెక్టర్ పదవిలో నియమించారు. మూడేళ్లపాటు ఆ పదవిలోనే కొనసాగాడు. మండలస్థాయిలో ఓ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. నాయకుడుగా ఎదిగేందుకు అప్పటి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఎంతో ప్రోత్సహించారు. కానీ షేక్‌మీరా తన పాత బుద్దిని వీడలేదు. ఓ బైక్‌ను దొంగతనం చేసి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబట్టాడు. 


దొంగిలించిన బైక్‌ విక్రయిస్తూ దొరికిన మీరా
జీకే వీధి మండలంలో ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పిండిరాము...చింతపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటి ముందు తన బైక్‌ను పార్కు చేసి వెళ్లగా...షేక్‌ మీరా చాకచక్యంగా ఆ బైక్‌ను ఈనెల ఒకటో తేదిన దొంగలించాడు. దీంతో బాధితుడు చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగిలించిన వాహనాన్ని మీరా విశాఖపట్నం తీసుకెళ్లి విక్రయిస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు నిందితుడుని చింతపల్లి పోలీసులకు అప్పగించారు. షేక్‌మీరాను అరెస్ట్ చేసిన పోలీసుుల ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.