Yalamanchili Politics: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం యలమంచిలి. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,00,097 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,49,547 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,50,545 మంది ఉన్నారు. తొలిసారిగా 1952లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్‌ పార్టీ, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 


ఇవీ ఎన్నికల ఫలితాలు


యలమంచిలి నియోజకవర్గంలో తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన పి బాపునాయుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎంఎన్‌ మూర్తిపై 5646 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సీవీఎస్‌ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన కె రామజోగిపై 3688 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసి నాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన వీవీ రావుపై 3628 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 


1967లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎన్‌ సత్యనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసినాయుడుపై 2355 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కేవీ కాకర్లపూడి విజయాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసినాయుడుపై 6548 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసినాయుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన 8667 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కేకేవీఎస్‌ రాజు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసినాయుడుపై 7628 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పప్పల చలపతిరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసినాయుడుపై 9920 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 


1989లో టీడీపీ నుంచి పోటీ చేసిన పప్పల చలపతిరావు మరోసారి విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వి సన్యాసినాయుడుపై 12,254 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో పప్పల చలపతిరావు మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎన్‌ ప్రభాకరరావుపై 24,246 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పప్పల చలపతిరావు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన యూవీ రమణమూర్తిరాజుపై ఆయన 7054 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో యూవీ రమణమూర్తిరాజు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రమణమూర్తిరాజు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జీవీ నాగేశ్వరరావుపై 5863 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన యూవీ రమణమూర్తిరాజు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు.


పీఆర్‌పీ నుంచి పోటీ చేసిన జీవీ నాగేశ్వరరావుపై 10,090 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి రమేష్‌బాబు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రగడ నాగేశ్వరరావుపై 8455 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యూ రమణమూర్తిరాజు మరోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పి రమేష్‌బాబుపై 4146 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు రమణమూర్తిరాజు సిద్ధపడుతున్నారు. టీడీపీ నుంచి పలువురు నేతలు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఎవరికి సీటు దక్కుతుందన్న దానిపై స్పష్టత కొరవడింది. జనసేన కూడా టికెట్‌ ఆశిస్తోంది. చూడాలి మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారో.