బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరింత బలహీన పడింది. వాతావరణ శాఖ మొదటి నుంచి చెబుతున్నట్టుగానే తీరం తాకే సరికి బలహీనపడుతూ వస్తోంది. ప్రస్తుతం తుపానుగా కొనసాగుతున్న అసని... రేపు ఉదయానికి వాయుగుండంగా మారిపోనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోంది. 


ప్రస్తుతానికి అసని తుపాను మచిలీపట్నానికి 40కిలోమీటర్ల దూరంలో కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కొన్ని గంటల్లో  కొనసీమ అంతర్వేది వద్ద  భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. 


తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీవర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 60-80కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 


తుపాను ప్రభావంతో కోస్తా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్లలో 8సెంటీమీటర్లు,వేటపాలెంలో 5.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లాలోని బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. నిజాంపట్నం హార్బర్‌లో 8వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


తుపాను విజృంభణతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఎక్కడికక్కడ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచిస్తున్నారు. 


నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాత్రి నుంచి నిలిచిన విద్యుత్‌ నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో గ్రామాల్లో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో రొయ్యల చెరువుల రైతులకు డీజిల్‌ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు లేక గంటకు 6 లీటర్ల చొప్పున జనరేటర్‌కు డీజిల్‌ వినియోగమవుతోంది. మైపాడు బీచ్‌ వద్ద 10 మీటర్లు మేర సముద్ర ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. 


దక్షిణ మధ్య రైల్వే కూడా తుపాను హెచ్చరికతో అప్రమత్తమైంది. 37 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేసింది. సికింద్రాబాద్‌ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్ల రద్దు అయ్యాయి. భీమవరం - విజయవాడ, విజయవాడ - మచిలీపట్నం, నర్సాపూర్ - నిడదవోలు, విజయవాడ - నర్సాపూర్, విజయవాడ నర్సాపూర్, మచిలీపట్నం - గుడివాడ, నిడదవోలు - భీమవరం జంక్షన్, గుంటూర్ - నర్సాపూర్, భీమవరం జంక్షన్ - మచిలీపట్నం, గుడివాడ - మచిలీపట్నం, కాకినాడ పోర్ట్ - విజయవాడ మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులు రద్దు అయ్యాయి.


విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పలు సర్వీస్‌లు రద్దు అయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. విశాఖ, రాజమండ్రి, కడపకు నడిచే లింక్ సర్వీసులు నిలుపుదల చేశారు. 
వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామంటోంది ఇండిగో సంస్థ. తుపాను దృష్ట్యా విశాఖ, రాజమండ్రి నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి 9 విమానాలు రద్దు చేశారు అధికారులు.