Rushikonda Palace Usage: విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన, వివాదాస్పద కట్టడంగా ఉన్న రుషి కొండ ప్యాలెస్‌ భవిష్యత్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ రాజసౌధాలను ప్రజా ప్రయోజనాలకు అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎలా వినియోగించాలనే అంశంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం మూడోసారి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్యాలస్‌ వినియోగంపై పలు కీలక ప్రతిపాదనలు చర్చించింది. 

Continues below advertisement

అంతర్జాతీయ హోటల్‌ దిగ్గజాల కన్ను

రుషి కొండపై ఉన్న ఈ కట్టడాలను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు దేశీయ, అంతర్జాతీయ హోటల్ గ్రూపుల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. తాజ్‌ గ్రూప్‌, లీలా హోటల్‌గ్రూప్‌అట్మాస్పియర్‌ కోర్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్యాలస్‌ను లగ్జరీ హోటళ్లుగా మార్చేందుకు ముందుకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనల్లో ఒక చిన్న మెలిక ఉంది. కొన్ని సంస్థలు హోటల్ నిర్వహణకు అదనపు స్థలం కావాలని కోరుతుండటం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. 

అడ్డంకిగా సీఆర్‌జెడ్‌ నిబంధనలు

రుషి కొడ ప్యాలస్ చుట్టూ ఉన్న స్థలాన్ని వినియోగించుకోవడంలో పర్యావరణ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ప్యాలస్‌ కింద ఉన్న 9 ఎకరాల స్థలం ఏకంగా ఏడు ఎకరాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌ నిబంధనలు పరిధిలోకి వస్తాయి. సముద్రపు ఆటుపోట్ల ప్రభావం వల్ల ఈ ఏడు ఎకరాల్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేసే అవకాశం లేదు. కేవలం మిగిలిన రెండు ఎకరాల్లో మాత్రమే ఏమైనా పనులు చేసే వీలు ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేారు. ఈ పరిమితుల మధ్య ప్రాజెక్టును ఎలా ఆర్థికంగా లాభదాయకంగా మార్చాలనే దానిపై కమిటీ తల బద్దలు కొట్టుకుంటోంది. 

Continues below advertisement

ప్రజల కోసం ప్రత్యేక విభాగాలు

రుషికొండ ప్యాలస్ పూర్తిగా ప్రైవేటు సంస్థలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రుషి కొండలోని చివరి రెండు బ్లాక్‌లను ప్రజల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, పర్యాటకుల అవసరాల కోసం ప్రత్యేకించనున్నట్టు మంత్రి పయ్యావుల తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న భవనాలపై అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించే సాంకేతిక అవకాశం ఉందని దీనిపై చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఈ భవనాల విషయంలో పర్యాటక మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆదాయం వస్తున్న పాత పర్యాటక భవనాలను కూల్చి వేసి, నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్యాలస్‌ను నిర్మించడం వల్లే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయని అన్నారు. నాడు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఆస్తులను ఎలా కాపాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అని బుర్రలు బాదుకోవాల్సి వస్తోందని కామెంట్ చేశారు.