Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యులకు, పేదల ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్యం అందించేందుకు పీపీపీ విధానం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహణ బాధ్యతను అప్పగించేందుకు యత్నించింది ప్రభుత్వం. కానీ ఒక్క ఆదోని కాలేజీ కోసమే బిడ్ దాఖలు అయింది. మిగతా కాలేజీలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో రాజీ లేదని పేదలకు మెరుగైన వైద్యం కోసం ముందడుగు వేయాలని సూచించారు.
రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన తాజా సమీక్షా సమావేశం రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగింది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం విధానంపై ప్రభుత్వం తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించింది.
పీపీపీ విధానంపై అపోహలు వద్దు
వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వెనుక ఉన్న శాస్త్రీయతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పద్ధతిని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం ద్వారా ఒక మెడికల్ కాలేజీ లేదా ఆసుపత్రి నిర్మాణ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం ఆర్థిక మద్దతు అందిస్తాయని చెప్పారు. మిగిలిన పెట్టుబడిని ప్రైవేటు సంస్థలు భరిస్తాయని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోందని, పీపీపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు.
మెడికల్ కాలేజీల టెండర్లు- ఆదోనిలో ముందడుగు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియలో పీపీపీ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే తాజా టెండర్ల ప్రక్రియ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వం మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది. బుధవారం సాయంత్రంతో ముగిసిన గడువులోకా కేవలం కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి బిడ్ దాఖలైంది. ప్రముఖ వైద్య సంస్థ కిమ్స్ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ టెండర్ వేసింది.
మిగిలిన మూడు ప్రాంతాలైన మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో టెండర్లు వేయడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ప్రభుత్వం స్పందించి పీపీపీ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలులో ఉందని గుర్తు చేస్తోంది. వెనక్కి తగ్గడం లేదని చెబుతోంది. బిడ్లు దాఖలు కాని కాలేజీల కోసం మరోసారి టెండర్లు ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థతో త్వరలోనే ఒప్పందం చేసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రభుత్వం కేవలం భవనాల నిర్మాణంతో సరిపెట్టకుండా ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మందుల లభ్యత, వైద్యుల నియామంపై కూడా దృష్టి సారించిందని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగుతుందని పేర్కొన్నారు.