నరసరావుపేట, ఆదోని: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు వేర్వేరు ప్రమాదాలలో పులి, చిరుతపులి మృతిచెందాయి. ఒక ఘటన పల్నాడు జిల్లాలో జరగగా, కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చిరుతపులి మృత్యువాత పడింది.
జాతీయ రహదారిపై వాహనం ఢీకొని ఆడపులి మృతిపల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం (డిసెంబర్ 23న) ఉదయం శిరిగిరిపాడు చెక్‌పోస్టు సమీపంలోని జాతీయ రహదారి 565పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 12 ఏళ్ల వయసున్న పులి చనిపోయింది. 'టైగర్-80' అనే ఈ పులి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకొట్టడంతో మృతిచెందింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు లేకపోయినా, పాదముద్రల ఆధారంగా పులి కొంతదూరం నడిచి వెళ్లి మరణించినట్లు నిర్ధారించారు. పొగమంచు, రోడ్డు మలుపుల కారణంగా వాహనదారుడు గమనించక పులిని ఢీకొట్టి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పులి మృతి ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు మార్కాపురం డీఎఫ్‌ఓ అబ్దుల్ తెలిపారు. ప్రమాదానికి కారణమని సంబంధిత వాహనం యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రైలు ఢీకొని చిరుతపులి దుర్మరణంమరో ప్రమాదంలో ఒక చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో చిరుతపులి అక్కడికక్కడే మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారిణి తేజశ్వి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వరుస ఘటనలు వన్యప్రాణుల రక్షణపై ఆందోళన కలిగిస్తున్నాయి.
విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు ఒకేరోజు రెండు వన్యప్రాణుల మృతిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. పులి మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వణ్యప్రాణులను రైలు ప్రమాదాల బారిన పడకుండా చేయడంపై ఫోకస్ చేశారు.
వన్యప్రాణుల రక్షణ సమాచారంటైగర్ రిజర్వ్ ప్రాధాన్యత: ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతున్నాయి కనుక, వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉంటాయి.
రక్షణ చర్యలు: జాతీయ రహదారులు అటవీ ప్రాంతాల గుండా వెళ్లే చోటు వన్యప్రాణుల కోసం అండర్ పాస్ (Underpass) లేదా 'ఎకో బ్రిడ్జ్' నిర్మించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
చట్టపరమైన నిబంధనలు: వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం పులులు, చిరుతలను చంపడం లేదా ప్రమాదాలకు కారణమవ్వడం నాన్-బెయిలబుల్ నేరం కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
వేగ పరిమితి: అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రాణ నష్టాన్ని అరికట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.