Nara Lokesh: రాజమహేంద్రవరం శుక్రవారం పర్యటించిన మంత్రి నారా లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగలకు గుడ్‌ న్యూస్ చెబితే, ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులతో ముఖ్యాముఖి నిర్వహించిన సందర్భంగా, వచ్చే జనవరి నెలలో జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు క్లస్టర్‌ బేస్డ్‌ విధానాన్ని తీసుకొస్తున్నట్టు లోకేష్ వెల్లడించారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం ఇచ్చి, ఆయా రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దీని కోసం నైపుణ్యం పోర్టల్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని ఏ విద్యకు ఎక్కడ అవకాశాలున్నాయో విద్యార్థులు దీని ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. 

Continues below advertisement

ప్రతి విద్యార్థికి ఏఐ అస్త్రం 

ప్రతి విద్యార్థికి ఉచితంగా ఏఐ టూల్స్‌ అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్‌ భరోసా ఇచ్చారు. తాను స్వయంగా జెమినీ ఏఐ వాడుతున్నానని, ఆ సంస్థతో మాట్లాడి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఏఐ టూల్స్‌ అందేలా చూస్తానన్నారు. ఉన్నత విద్యలో పరిశోధనలు పెరగాలని, బోధన పద్ధతులు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్మకు చెప్పే విధంగా ఉండాలని అమ్మకు చెప్పలేని ఏ పని చేయొద్దని అంటూ యువతకు సందేశం ఇచ్చారు. "మా తల్లిని అవమానిస్తే ఎంత ఇబ్బందిపడ్డారో నేను కళ్లారా చూశా. ఆ రోజు నుంచే మూమెంట్‌గా చేయాలనే ఆలోచన వచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు స్త్రీలను గౌరవించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా లాంటి పదాలను విడనాడాలి. విద్యార్థులకు నైతిక విలువలు చాలా అవసరం. విజయానికి దగ్గరి దారులు లేవు. నైతిక విలువలు పెంపొందించుకోవాలి. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించుకున్నాం. నైతిక విలువలపై ఆయన రూపొందించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశాం. కరిక్యులమ్‌ను ప్రక్షాళన చేస్తున్నాం. ప్రతి శనివారం నైతిక విలువలపై క్లాస్ ఏర్పాటుచేస్తాం. మహిళలను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం." అని అన్నారు. 

నైపుణ్యం పోర్టల్‌ను కూటమి ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. ఆ పోర్టల్‌లో ఇంటర్వ్యూకు ఎలా హాజరుకావాలి, ఏవిధంగా సిద్ధం కావాలి, ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఈ పోర్టల్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. "2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారు. అందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ సాధించాలంటే పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు ఇటీవల శంకుస్థాపన చేశాం. 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వారు చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. రిలయన్స్ డేటా సెంటర్ కూడా రాబోతోంది. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 150 కేసులు వేసినా 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేసి 16వేలమందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6వేల మందిని కానిస్టేబుళ్లుగా నియమించాం. జనవరి నెలలో జాబ్ కేలండర్ విడుదల చేస్తాం." అని అన్నారు. యువత రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నామన్నారు లోకేష్. సమాజంలో మనం ఆశించే మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత నేను నీకు మెంటర్ గా ఉంటా. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అన్నారు.   కాలేజీలో సమావేశం తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీపీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని రెండు నెలల్లో జైల్లో పెడతామని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అని అన్నారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని  అన్నారు. ఫ్యాక్షన్ దాడిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేస్తూ...  కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వచ్చే 15 ఏళ్ల వరకు కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలపై అనవసరంగా ఇబ్బంది పెట్టే వారిని విడిచిపెట్టేది లేదని ఇప్పటి వరకు రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని ఇంకా చాలా పేజ్‌లు ఉన్నాయని హెచ్చరించారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. 

Continues below advertisement