ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 పేరిట ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. గత రెండు రోజులుగా జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ లక్ష్య సాధనకు పది కీలక సూత్రాలను ప్రతిపదికగా తీసుకున్నారు. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా, అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ విజన్ ప్రధాన ఉద్దేశం.
పది సూత్రాల ప్రస్థానం:- రాష్ట్ర రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, నైపుణ్యం- ఉపాధి కల్పన, నీటి భద్రత, అగ్రీటెక్, లాజిస్టిక్స్, ఇంధన నిర్వహణ, ప్రాజెక్టు పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ వంటి పది అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని సీఎం స్పష్టం చేశారు.
పీ4 మోడల్ ద్వారా పేదరిక నిర్మూలన:- రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా తుడిచి పెట్టేందుకు పీ4 విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించడంతోపాటు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదే తెలుసుకోవడానికి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ కార్డు జారీ చేయనున్నారు.
సుస్థితర అభివృద్ధి-పారిశ్రామిక హబ్;- ఆంధ్రప్రదేశ్ ఈస్ట్‌కోస్ట్‌లో లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్టు సీఎం వెల్లడించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి, అంతర్జాతీయ మార్కెట్‌కు ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి గ్రామంలో నెట్ జీరో కాన్సెప్టు రావాలని, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి జరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. డెలివరీ గవర్నెన్స్‌లో వేగాన్ని పెంచేందుకు అధికారులకు ర్యాంకింగ్స్ కూడా ఇస్తామని ప్రకటించడం పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా మరో అడుగు ముందుకేశారు.
చెరువుల పునరుద్ధరణ- భారీ లక్ష్యం:- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38, 400పైగా మైనర్ ఇరిగేషన్ చెరువులను నీటితో నింపే ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.వర్షాకాలం పూర్తయ్యే సరికి భూగర్భ జల మట్టం 3 మీటర్ల లోపే ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైతే మొబైల్ లిఫ్ట్ పంపులను ఉపయోగించి అయినా ప్రతి చెరువును నింపాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు 95 శాతం నిండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఆర్థిక లాభాలు- విద్యుత్ ఆదా;- భూగర్భ జలాలు పెరగడం కేవలం రైతులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానాకి కూడా ఊరట కల్పిస్తుందని అన్నారు. ఒక మీటరు భూగర్భ జం పెరిగితే అదనంగా 75 టీఎంసీల నీరు అందుబాటులోకి రావడమే కాకుండా కనీసం ఐదువేల కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుంది. ప్రస్తుతం ఉచిత విద్యుత్ పథకానికి ఏటా 14,500 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుంది. దానికి పదిహేను వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. నీటి మట్టం పెరిగితే పంపులు తక్కువ విద్యుత్‌తో ఎక్కువ నీటిని తోడగలవు. తద్వారా పర్యావరణ రక్షణ కూడా జరుగుతుందని సీఎం విశ్లేషించారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం;- చెరువులు, కాలువలు, డ్రెయిన్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించడంలో కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ వర్షాల సమయంలో వరద ముప్పు లేకుండా ఉండాలంటే డ్రెయిన్‌ను క్లియర్ చేయించడం అత్యవసరమని సీఎం సూచించారు. నీరు సమృద్ధిగా ఉంటేనే ప్రజల్లో నూతన ఉత్సాం వస్తుందని, అది రాష్ట్ర ప్రగతి బాటలు వేస్తుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.
నైపుణ్యమే ఆయుధం:- భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధే కీలక భూమిక పోషిస్తుందని, అందుకే సంప్రదాయక కోర్సుల మాదిరిగానే స్కిల్ డెవలప్‌మెంట్ కూడా డిగ్రీలు పొందే అవకాశాన్ని కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం వంటి వివిధ శాఖలు ఎంత మంది యువతకు ఉపాధి కల్పించాయనేది ఇకపై ప్రభుత్వ పని తీరుకు కొలమానం కానుంది. యువగళం ద్వారా ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగా ఇప్పటి వరకు 4.5 లక్షల మందికి ఉపాధి కల్పించగలిగామని,ఈ వివరాలన్నింటినీ పారదర్శకత కోసం పేర్లతో సహా డ్యాష్‌బోర్డులో ఉంచాలని ఆయన ఆదేశించారు.
జనాభా నిర్వహణ, ఆరోగ్య సూచీలు:- రాష్ట్రంలో వర్క్‌ఫోర్స్ పెరగాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఉగాది నాటికి కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, మాతా శిశు మరణాల రేటును సున్నాకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరేళ్ల లోపు పిల్లల్లో లోపాలను గుర్తించేందుకు కేర్ అండ్ గ్రో యాప్‌ను వినియోగిస్తున్నారు.
సామాజిక భద్రత- జీరో సూసైడ్స్:- ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. జీరో సూసైడ్స్ లక్ష్యంగా రైతులు, విద్యార్థులు, కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. డ్రగ్స్, టొబాకో ఫ్రీ సమాజం కోసం చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి అందే సంక్షేమ పథకాలు, సేవలను పర్యవేక్షించడం ద్వారా కుటుంబ సాధికారిత సాధించడమే స్వర్ణాంధ్ర-2047 అంతిమ లక్ష్యం