YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు అవుతున్న మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వ అక్రమంగా ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. దీనిపై గవర్నర్‌తో మాట్లాడటమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఇంకా చంద్రబాబు వినకపోతే మాత్రం తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా కాలేజీలు తీసుకున్న వారిని జైల్లో పెడతామని హెచ్చరించారు.
కోటి సంతకాలు గవర్నర్ ఆఫీస్‌కు చేరుకున్నాయని జగన్ చెప్పారు. కోటీ నాలుగు లక్షల సంతకాలు సేకరించడం చరిత్రగా అభివర్ణించారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొన్నారని అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని చెప్పుకొచ్చారు. ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతం చేశామని అన్నారు." అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు సంతకాల ఉద్యమం జరిగింది. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించాను. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, గవర్నర్‌ని కలిసే అంశం అందరితో చర్చించాను. వైసీపీ పిలుపు మేరకు ప్రజలంతా వచ్చి ఈ ఉద్యమంలో భాగమయ్యారు." అని తెలిపారు.
అన్ని విభాగాల్లో విఫలమైన చంద్రబాబు తన గ్రాఫ్ పడిపోతుందని ఇప్పటికి గుర్తించారని వైఎస్ జగన్ అన్నారు. అయితే ఆ గ్రాఫ్ కలెక్టర్‌లు, అధికారుల పని తీరు వల్ల పడిపోతుందని చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. " చంద్రబాబు చెబుతున్న మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు. తన అసమర్థతను కలెక్టర్ల మీద రుద్దుతున్నారు. అధికారుల పనితీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు కాబట్టే గ్రాఫ్ పడిపోతుంది. మన హయాంలో అమలైన పథకాలు రద్దు చేశారు. సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది. ఇప్పటికే రెండేళ్లు పూర్తి చేసుకుందీ. త్వరలోనే మూడో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటి వరకు జరిగింది సున్నా." అని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం స్కూళ్లు, ఆసుపత్రులు నడకపోతే ప్రైవేటు దోపిడీ పెరిగిపోతుందన్నారు జగన్. అందుకే వీటి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు." మెడికల్ కాలేజీలతో టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి. పేదలకు ఉచిత వైద్యం లభిస్తుంది. అందుకే ప్రభుత్వం ప్రైవేటీకరించాలనే ఆలోచనను ప్రజలకు గట్టిగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు వివరిస్తాం. తర్వాత ఇవే ప్రతులతో కోర్టులను ఆశ్రయిస్తాం. ప్రజల మనోభావాలను తెలియజేస్తాం. కోటి సంతకాలు చూడాలంటూ అఫిడవిట్‌లు వేస్తాం. అప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేస్తాం. కాలేజీలు తీసుకున్న వారిని జైలుకు పంపిస్తాం. ఈ ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణంగా నిర్ణయాలు తీసుకుంటాం. " అని హెచ్చరించారు.