విశాఖపట్నం: విశాఖ పేరు చెప్పగానే రుషికొండ బీచ్ గుర్తొస్తుంది. అందులోరూ బ్లూఫ్లాగ్‌ గుర్తింపు పొందిన ఏపీలోని ఏకైక బీచ్‌గా రుషికొండకు పేరు తెచ్చుకుంది. కానీ రుషికొండ బీచ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది. దాంతో పర్యాటకశాఖ అధికారులు బీచ్ వద్ద జెండాలను శనివారం కిందకు దించేశారు. అదేంటీ జెండాలు ఎందుకు దించేశారని విశాఖ వాసులు చర్చించుకుంటున్నారు. అసలు విషయం తెలిసి షాకవుతున్నారు.

2020లో రుషికొండ బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా ధ్రువీకరించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (FEE) సంస్థ బీచ్‌లకు, పర్యాటక ప్రాంతాలకు ఈ గుర్తింపు అందిస్తుంది. కానీ నాలుగేళ్లకే సీన్ రివర్స్ అయింది. రుషికొండ బీచ్‌లో కుక్కలు తిరుగుతున్నాయని, వ్యర్థాలు పేరుకుపోయాయి, సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. అక్కడ వాకింగ్ ట్రాక్,  నడక మార్గం దెబ్బతినడంతో పాటు టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు, సరిగ్గా లేవని ఫొటోలతో సహా డెన్మార్క్ ఎఫ్ఈఈ సంస్థకు ఫిబ్రవరి 13న ఫిర్యాదు అందింది. నిర్వహణ అధ్వానంగా ఉందని, రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ షిప్ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్ష్యాలుగా ఫొటోలు, వీడియోలు పంపడంతో వాటిని పరిశీలించిన డెన్మార్క్ సంస్థ రుషికొండకు తాత్కాలికంగా బ్లూఫ్లాగ్ రద్దు చేసింది. దాంతో బీచ్ వద్ద జెండాలను అధికారులు కిందకి దించేశారు. 

ఎవరిదీ నిర్లక్ష్యం.. బాధ్యులెవరు.. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూ.7 కోట్ల కేంద్రం నిధులతో రుషికొండ బీచ్ వద్ద మౌలిక వసతులు కల్పించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కొన్నేళ్లపాటు విశాఖ బీచ్‌ నిర్వహణను చూసుకుంది. ఆపై వైసీపీ అధికారంలోకి వచ్చాక బీచ్ నిర్వహణ పనులను ప్రైవేటు పరం చేసింది. గత ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్వహణను ప్రైవేటుకు అప్పగించింది. ఆ సంస్థ నిబంధనలు పాటించకపోవడం, రుషికొండ నిర్వహణను గాలికొదిలేసింది. 2024 నవంబరుతో ఆ ప్రైవేట్ సంస్థ నిర్వహణ గడువు సైతం ముగిసింది. మరోవైపు విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, పర్యాటక శాఖగానీ రుషికొండపై ఫోకస్ చేయని కారణంగా బీచ్‌కు ఈ దుస్థితి వచ్చిందని విశాఖ వాసులు చెబుతున్నారు. రుషికొండ బీచ్‌ను పట్టించుకోని కారణంగానే, నిర్వహణ సరిగ్గా లేదని ఫిర్యాదు రావడంతో.. అన్నీ పరిశీలించిన డెన్మార్క్ సంస్థ బ్లూఫ్లాగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం తిరిగి రుషికొండకు పూర్వవైభవం తీసుకొస్తే మళ్లీ బ్లూఫ్లాగ్ గౌరవాన్ని బీచ్ దక్కించుకోనుంది.

Also Read: AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు