Vizag News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. విశాఖ గర్జన పేరుతో నిర్వహించిన ర్యాలీ మొత్తం ఉద్రిక్తంగానే సాగింది. ర్యాలీ ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడులు చేశారని వెల్లడించారు. 


విశాఖపట్నం విమానాశ్రయం వద్ద అనుమతి లేకుండా 300 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడినట్లు అధికారులు తెలిపారు. మంత్రి ఆర్కే రోజా తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులను అగౌరవపరిచేలా అసభ్యకర పదజాలం వాడారని.. అంతే కాకుండా వారిని చంపాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ నియమ నిబంధనలు అన్నీ అతిక్రమించారని తెలిపారు. 


నాయకులు, కార్యకర్తలపై కేసులు..


పెందుర్తి ఎస్.హెచ్.వో నాగేశ్వర రావుపై, సిబ్బందిపై దాడికి జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విశాఖ సీపీ వెల్లడించారు. మున్నంగి దిలీప్ కుమార్, సాయి కిరణ్, సిద్ధు, హరీశ్ లాంటి సామాన్య ప్రజలపై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో వారికి గాయాలు కూడా అయ్యాయని గుర్తించారు. జనసే కార్యకర్తల చర్యలతో విశాఖ విమానాశ్రయం వద్ద స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయని చాలా మంది వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణీకులు విమానాలను మిస్ చేసుకున్నారని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయిన జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టినట్లు విశాఖ సీపీ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 


అసలేం జరిగిందంటే..?



విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైంది. వైసీపీ నేతలు నిర్వహించిన విశాఖ గర్జన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకోగా అదే సమయంలో  మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి జనసైనికుల పని అని, వైసీపీ నేతలు, మంత్రులు గుడివాడ అమర్ నాథ్, రోజా ఆరోపించారు. జనసైనికులు ఎవరిపై దాడి చేయలేదని, తమ కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి అధికార వైసీపీ చేస్తున్న కుట్ర ఇది అని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తన పర్యటనను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే.. పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానంటూ పోలీసులకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ గర్జన విఫలం చెందిందనే అక్కసుతోనే ప్రభుత్వం ర్యాలీ ఆపిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. 



తమ చర్యలతో శాంతి భద్రతలకు భంగం కలిగించిన, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసిన జనసేన శ్రేణులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనలో పోలీసులు.. పలువురు జనసేనన కార్యకర్తలను గుర్తించి పట్టుకున్నారు. విశాఖపట్నం దాడి ఘటనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.