Visakha Cp Ravishankar: విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లకు అడిషనల్ డీజీపీ, విశాఖ సీపీ రవిశంకర్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ నగర పరిధిలో ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లు వాడుకుంటూ భూకబ్జాల (Vizag Land Grabbing)కు పాల్పడుతున్నట్లు డయల్ యువర్ సీపీ, స్పందనా కార్యక్రమాలకు అధిక ఫిర్యాదు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవిశంకర్ భూకబ్జాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివాదాల్లో ఉన్న భూములు, అద్దెకు నివాసముంటూ..అదే ఇళ్లను ఆక్రమించేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ నేత పేరు వాడుకొని భూములు, ఇళ్ల ఆక్రమిస్తే...పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 


కబ్జా చేస్తే పీడీ యాక్టు నమోదు
ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా చేసినా, మతపరమైన లేదా స్వచ్ఛంద సంస్థలను లాక్కున్నా సహించేది లేదన్నారు అడిషనల్ డీజీపీ రవిశంకర్. దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూములు లేదా ఏదైనా ఇతర ప్రైవేట్ ఆస్తులను బలవంతంగా లాక్కున్నా పీడీ యాక్టు కింద కేసులు పెడతామన్నారు. వ్యక్తిగతంగా కబ్జాలకు పాల్పడినా లేదంటే గ్రూపులుగా భూములను లాక్కున్నా...ఏపీ ల్యాండ్ గ్రాబిక్ యాక్ట్ ప్రకారం పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. భూకబ్జాలకు పాల్పడుతున్న సహకరించినా వ్యక్తులను వదిలిపెట్టబోమన్నారు. ఏదైనా వ్యక్తి భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నా, నిర్మాణం కోసం దానిపై అనధికారిక నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. భూములు కబ్జా, ఇళ్ల ఆక్రమణల కోసం బెదిరింపులకు దిగినా, వారికి సహకరించినా వారందరిపై భూకబ్జా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. 


నగరం నుంచి బహిష్కరిస్తాం
ప్రశాంత విశాఖ మహా నగరంలో ఏ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల పేరు వాడుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అడిషనల్ డీజీపీ రవిశంకర్ హెచ్చరించారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు-1982 ప్రకారం పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు. కబ్జాలకు పాల్పడిన అవసరం అనుకుంటే నగరం నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్ ఆచ్చారు. అదేవిధంగా ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, పిల్లలు దూరంగా ఉన్న తల్లిదండ్రులను మోసం చేసేందుకు ప్రయత్నించినా కేసులు పెడతామన్నారు. ఎలాంటి ఆసరా లేని ఒంటరి కుటుంబాల వారి భూములు, ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిని, వారికి సహకరించిన వ్యక్తులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 


ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు భూకబ్జాలకు పాల్పడినా,  సహకరించినా విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీజీపీ రవిశంకర్ అన్నారు. పోలీసులు, అడ్వకేట్స్, మాజీ తహాశీల్దార్లు, వీఆర్ఓలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమన్నారు. అద్దె ఇళ్లు దురాక్రమణదారులను , ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్న ముఠాలను గుర్తించామన్నారు. వారి కోసం ప్రత్యేక టీమ్ లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న ఆయన, కబ్జాలకు పాల్పడినా, సహకరించిన వారిని జైలుకు పంపిస్తామన్నారు.