ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. YSRTP అధినేత్రి షర్మిల ఏపీ రాజకీయాల్లో కాలుమోపడం దగ్గర నుంచి చాలా ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవితో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. 


కడప జిల్లాలో ఏం జరగబోతోంది.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీ రాజకీయాల్లోకి రారు అనుకున్న వైఎస్ షర్మిళ దానికి ఓకే చెప్పేయడం.. కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు ఢిల్లీ బయలుదేరడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. షర్మిళ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో రాజకీయం చేస్తే పరిస్థితి మారిపోతుందని ముఖ్యంగా కడప జిల్లాలో ఆ ప్రభావం ఉంటుందన్న అంచనాలున్నాయి. వైఎస్సార్సీపీకి దూరం అయిన నేతలు  షర్మిళ వెంట నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది.  షర్మిళ చేరికకు రేపే ముహూర్తం కావడంతో దాని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా  చేసిన ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిళతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. 


బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌కుమార్
అయితే షర్మిల చేరికకు ముందే టీడీపీ నేత బీటెక్‌ రవితో బ్రదర్ అనిల్‌కుమార్ ఉన్న ఫోటో సోషల్ మీడియాకు చేరింది. ఇది లేటెస్ట్ ఫోటోనా లేక పాతదా అన్న దానిపై క్లారిటీ లేనప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ ఫోటో కలకలం రేపింది. బీటెక్ రవి వైఎస్ కుటుంబంపై పులివెందుల నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. ప్రస్తుతం కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధం లేనప్పటికీ పులివెందులలో జగన్ మోహనరెడ్డి ప్రత్యర్థితో బ్రదర్‌ అనిల్‌ కుమార్ సమావేశం అవ్వడం ప్రాథాన్యం కలిగించింది. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి పిల్లలిద్ద్దరూ పరస్పరం దూరం అయిన విషయం తెలిసిందే. జగన్‌కు దూరంగా జరిగిన షర్మిళ ప్రత్యేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి అక్కడ రాజకీయాలు చేశారు. సుదీర్ఘ పాదయాత్ర కూడా నిర్వహించి.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. 


షర్మిల ఏపీకి రావాలని డిమాండ్ 
షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడే చాలా కామెంట్లు వచ్చాయి. జగన్‌తో సమస్య వస్తే.. తెలంగాణ రావడం ఏంటని.. ఆంధ్రాకు చెందిన ఆమె అక్కడ రాజకీయాలు చేయాలని విమర్శలు వచ్చాయి. అలాగే షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన తర్వాత ఆమెను ఆంధ్రా రాజకీయాల్లో భాగం  చేయాలనే మాటలు వినిపించాయి. అయితే మొదట్లో దీనికి సుముఖంగా లేని ఆమె ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మాత్రమే చెప్పిన ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా చెప్పలేదు. కానీ షర్మిల వస్తే ఎలా ఉంటుందన్న దానిపై చాలా అంచనాలున్నాయి. 


కడప నుంచి పోటీ
రాష్ట్రంలో రాజకీయం ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. తెలుగుదేశం -జనసేన పోటీ కన్ఫామ్ అయిపోయింది. దాంతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న స్పష్టత లేదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసున్న తెలుగుదేశం ఆ తర్వాత దూరంగా ఉంది. బీజేపీతో  కలిసేందుకే ప్రయత్నిస్తోంది. కానీ కొన్ని రోజుల కిందట  బెంగళూరు ఎయిర్‌పోర్టులో డీకే శివకుమార్- చంద్రబాబు “కాకతాళీయ కలయిక” ఏమైనా భవిష్యత్ సూచికలు ఇస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు.


అలాగే షర్మిల కాంగ్రెస్ లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటే ఆవిడ కడప నుంచి పోటీ చేస్తారన్న  మాట కూడా వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. తెలుగుదేశం ప్రస్తుతానికి ఏం చెప్పలేదు. కానీ ఒకవేళ వాళ్లు కూడా కలుస్తారా అన్న దానికి సూచికగా.. బ్రదర్ అనిల్- బీటెక్ రవి కలిశారు అనుకోవచ్చా.. ఇలా చాలా సందేహాలు వస్తున్నాయి. బ్రదర్ అనిల్ కొన్నాళ్లుగా క్రైస్తవ సంఘాలతో సమావేశాలు పెడుతూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కవేళ ఇవన్నీ నిజం అయితే కడప పోటీ హాట్ హాట్ గా ఉండొచ్చు. ఎందుకంటే.. తెలుగుదేశం ఎంపీ సీట్లో సపోర్టు చేస్తే.. షర్మిళ కుటుంబం పులివెందుల అసెంబ్లీ సీట్లో రవికి సహాయం చేయొచ్చు.  ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ.. కడప రాజకీయం మాత్రం రంజుగా కనిపిస్తోంది.