Alluri Sitaramaraju District News | అనంతగిరి: రైతులు పొలం పనులు చేయాలంటే దుక్కి దున్నాలి. దుక్కి దున్నాలంటే ఎద్దులతో పని. కానీ తమ ఎద్దులు, ఆవులను బెంగాల్ టైగర్ చంపడంతో, పరిహారం అందకపోవడంతో రైతు కుటుంబాలే కాడెద్దులుగా మారి దుక్కి దున్నుతూ నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలో ఈ సీన్ కనిపించింది. అన్నదాతల కష్టాలు చూసిన వారు ప్రభుత్వం వారికి అండగా నిలవాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

మేతకు వెళ్లిన పశువులను చంపిన బెంగాల్ టైగర్

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగ. చిన్నకోనిల గ్రామాల్లో గిరిజన ఆదివాసి రైతులు సోముల పైడమ్మ, సోముల చిన్న గంగమ్మ, కోటపర్తి గంగులు, కరాసి లచ్చమ్మ, బూరిగ  గౌరమ్మ w/0 ధర్మయ్యలకు చెందిన 3 ఆవులు, 4 ఎద్దులు 2023 జనవరి మొదటి వారంలో అడవిలో మేతకు వెళ్లాయి. ఆ సమయంలో బెంగాల్ టైగర్ దాడి చేసి వారి ఆవులు, ఎద్దులను చంపింది. ఈ విషయంపై అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాక్. No. 492/2022/SA. 8-2-2023 న పులి చంపేసిందని నిర్ధారించారు. పాడేరు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కు ఆవుల మృతిపై నివేదిక సైతం పంపించారు. ఫారెస్ట్ అధికారులు వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. 

నష్టపరిహారం రాకపోవడంతో రైతుల నిరసన

నేటికీ మూడు సంవత్సరాలు గడుస్తున్నా చనిపోయిన తమ ఎద్దులకు, ఆవులకు సంబంధించి రావాల్సిన నష్ట పరిహారం రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే తమది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఎద్దులు, ఆవుల ద్వారానే దున్నుతూ పొలం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఎద్దులు కొనుక్కోవాలంటే సంతలకు వెళ్లి కనీసం జత ఎద్దులకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.  అంత డబ్బులు మా దగ్గర లేవు. దీంతో మా వ్యవసాయ పనులు సాగాలంటే తామే స్వయంగా నాగలి పట్టి కాడెద్దులుగా మారి పొలాన్ని దున్నుతూ నిరసన వ్యక్తం చేశారు. ఐటిడిఏ  Po, అల్లూరి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పులి చంపేసిన తమ దుక్క ఎద్దులు, ఆవులకు ఫారెస్ట్ అధికారుల ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. 

రొంపిల్లి బీట్ ఆఫీసర్ కు పలుమార్లు తమకు రావాల్సిన నష్ట పరిహారం కోసం అడిగారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తే ఇస్తామని వారు చెబుతున్నారు. మూడు ఏళ్లు గడిచినా తమకు నష్ట పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఎద్దులు లేక, వ్యవసాయం చేయలేకపోతున్నాం.. పూట గడవటం కష్టంగా మారిందని వాపోయారు. తక్షణమే అల్లూరి జిల్లా కలెక్టర్  జోక్యం చేసుకొని నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. 

నెల రోజుల్లో తమకు రావాల్సిన నష్ట పరిహారం ఇవ్వకపోతే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ ఎదుట నాగళ్లతో తాము కాడెద్దులుగా దుక్కు దున్నుతూ ఆందోళనకు దిగుతామని చెప్పారు. బాధిత గిరిజన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు డిమాండ్ చేశారు.