Yoga Day event in Vizag | విశాఖపట్నం: విశాఖ వేదికగా నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే, యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులుతో యోగా డే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్ పై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. యోగాంధ్రకు ఏపీ ప్రభుత్వం ప్రజాధనం వృథా చేసిందంటూ చేసిన మాజీ సీఎం జగన్ విమర్శలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కొందరి గురించి మాట్లాడితే ఏ ప్రయోజనం ఉండదు. రుషికొండ ప్యాలెస్‌కు వందల కొట్లు ఖర్చు చేసిన వాళ్లు ఈరోజు మా పాలనపై విమర్శలు చేయడమా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యోగాంధ్రకు కేంద్రం రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అభినందించిన చంద్రబాబు

విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే (international Yoga day) జరిగిన తీరుపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. యోగాంధ్ర ఈవెంట్ ద్వారా పలు ప్రపంచ రికార్డుల సాధించేందుకు కృషిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకుచంద్రబాబు అభినందించారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, మంత్రులు, అధికారులు, అన్ని విభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యత తీసుకుని పనిచేసిన తీరును సీఎం చంద్రబాబు అభినందించారు. ఏపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగా డే ఈవెంట్‌కు అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలిరావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అధికారులు చంద్రబాబుతో అన్నారు. విశాఖ యోగా డేలో 3 లక్షల మందికి పైగా యోగా సాధనలో పాల్గొనడంపై అంతా హర్షం వ్యక్తం చేశారు. పాల్గొన్నవారి లెక్కింపులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం ఫలితాన్ని ఇచ్చిందన్నారు మంత్రులు.

యోగా డే పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు.

విశాఖపై ప్రత్యేకమైన అభిమానం..

‘విశాఖ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. హుద్ హుద్ సమయంలో మా కృషిని విశాఖ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. హుద్ హుద్ సమయంలో దీపావళి పండగ రోజు బాణాసంచా కాల్చవద్దంటే ఒక్కరూ కాల్చలేదు. ఇవాళ నా పిలుపుతో వృద్ధులు కూడా యోగా ఆసనాలు వేశారు. 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖ డిక్లరేషన్ తీసుకున్నాం. యోగా గేమ్ ఛేంజర్. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్య రంగానికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. యోగా, నేచురోపతి, ఆయుర్వేదం మన వారసత్వ సంపద. బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు’ సీఎం చంద్రబాబు.