హైదరాబాద్ లో సినీ కార్మికుల ధర్నాతో టాలీవుడ్ లో ఒకరోజు సినిమా షూటింగ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా ఆ వివాదం కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అదే ఏపీలో సినీ నిర్మాణం.


టాలీవుడ్ షూటింగ్ లకు  మరో  ప్రత్యామ్నాయం


బాలీవుడ్ అనగానే అందరికీ ముంబయి గుర్తు వస్తుంది. అయితే అక్కడ సినిమా షూటింగ్ ల కోసం ముంబయి మాత్రమే కాకుండా ఢిల్లీ సమీపంలోని  నోయిడా లాంటి ప్రాంతాల్లోనూ సినీ నిర్మాణానికి అనుకూలంగా స్టూడియోలను నిర్మించుకున్నారు. దేశంలోనే అత్యధికం గా సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకున్న టాలీవుడ్ 2021 తరవాత బాక్సాఫీస్ విజయాల పరంగా కూడా దేశం లోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అయితే సినీ నిర్మాణం పరంగా ఇప్పటికీ ఒక్క హైదరాబాద్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది  షూటింగ్ లకు ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు నిర్మాతలకు తమ సినిమాలను పూర్తి చేసుకోవడానికి వేరే ఆప్షన్ లేకుండా పోతోంది.



వైజాగ్ లో అన్ని సౌకర్యాలూ రెడీ


ప్రస్తుతం తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో ఏపీ లో కూడా సినీ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం పదేపదే సినీ పెద్దలను కోరుతోంది. అయినప్పటికీ ఇంకా ఆ దిశగా నిర్మాతలు ఆలోచించడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. వైజాగ్ లో ఆల్రెడీ ఉన్న స్టూడియో తోపాటు హైద్రాబాద్ లో లభ్యంకాని సముద్ర తీర అందాలు, దగ్గర్లోని కోనసీమ ప్రాంతాలు , షూటింగ్ కు కావాల్సిన జనం ఇలా ఇక్కడ లేని సౌకర్యం అంటూ లేదు. సరైన డబ్బింగ్ థియేటర్, ఎడిటింగ్ సౌకర్యం  ఒక్కటీ  అమర్చుకుంటే  షూటింగ్ లకు హైదరాబాద్ కు ఏమాత్రం తీసిపోదు విశాఖపట్నం. విశాఖపట్నాన్ని సినీ నిర్మాణాల పరంగా అభివృద్ధి చేసుకుంటే నిర్మాతలకు తమ సినిమాల నిర్మాణానికి తెలుగు రాష్ట్రాల్లోనే మరో బేస్ ఏర్పడడం తోపాటు.. ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడు షూటింగ్ ఆగకుండా మరో ప్రత్యామ్నాయం లభించే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.