Simhachalam Incident: విశాఖ జిల్లా సింహాచలం దుర్ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఈ ఇన్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో విచారణ చేయిస్తోంది. మరోవైపు ఇలాంటి దుర్ఘటనలు రాష్ట్రంలో కంటిన్యూగా జరుగుతున్నాయని జోక్యం చేసుకోవాలని కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.
చందనోత్సవం రోజున సింహాచలం దేవస్థానంలో గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ కమిటీ సింహాచలంలో పర్యటించి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. కాంట్రాక్టర్, ఇంజినీర్‌ను విచారించింది.
ఈ కమిటీ విచారణలో కాంట్రాక్టర్, ఇంజినీర్ అయిన లక్ష్మణ్‌రావు కీలక విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. తాత్కాలిక గోడను అధికారులే నిర్మించాలని చెప్పినట్టు విచారణ కమిటీకి చెప్పారట. దేవదాయ, పర్యాటక శాఖ ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు లక్ష్మణ్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు దేవాదాయశాఖ, పర్యాటక శాఖ అధికారులను కూడా కమిటీ విచారించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి లక్ష్మణ్‌రావుతోపాటు ఈవో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజును కూడా త్రిసభ్య ధర్మాసనం విచారించింది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ అన్నింటి గురించి ఆరా తీశారని సమాచారం. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఒక్కరు చెప్పిన విషయాలతో ఓ నిర్ణయానికి రాలేమని త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు లభించిన సమాచారం మేరకు మిగతా వాళ్లను కూడా విచారిస్తామన్నారు. వివరాలు సేకరించి, అందర్నీ విచారించి మూడు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇస్తామని వివరించారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి: వైసీపీ ఎంపీ
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని వైసీపీకి చెందిన ఎంపీ గురుమూర్తి కేంద్రానికి లేఖ రాశారు. దేవాలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని అందులో విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తిరుపతి లేఖ రాశారు. పరిపాలన వైఫల్యం, భద్రతా లోపాల కారణంగా భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటన గురించి కేంద్రానికి హోంమంత్రి వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో కూడా వందకుపైగా ఆవులు చనిపోయినట్టు తెలిపారు. ఇవన్నీ పాలనా వైఫల్యాలేనని ధ్వజమెత్తారు. జోక్యం చేసుకొని ఆయా సంస్థల పవిత్రత కాపాడాని వేడుకున్నారు.
జ్యుడీషియల్ విచారణ చేపట్టాలి: వైసీపీ
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం దుర్ఘటన జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి టైంలో ప్రభుత్వాధికారులతో విచారణ చేపిస్తే నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. ప్రచారంపై ఉన్న పిచ్చి కారణంగానే ఇది జరిగిందని ధ్వజమెత్తారు. వీఐపీలపై పెట్టిన శ్రద్ధ సామాన్య భక్తులపై చూపించలేదన్నారు. అందుకే ఈ ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంతజరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని కనీసం సంప్రోక్షణ కూడా చేయలేదని ఆరోపించారు.