Pawan Kalyan satires on CM Jagan: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తనకున్న అనుబంధం ప్రజలకు తెలుసు, కానీ ప్రజలకే ప్రాధాన్యమని ప్రత్యేక హోదా కోసం వారితో విభేదించినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అమిత్ షా ఆఫీసుకు వెళ్లిన తాను.. సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో కూడుకున్నది మాత్రమే కాదు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం అని చెప్పానన్నారు. దీనికి ప్రత్యేకంగా గనులు ఇప్పించాలని, 30 వేల కార్మికులు ఆధారపడి ఉన్నారని చెప్పారు. పార్లమెంట్ లో చిన్న ప్లకార్డు కూడా పట్టుకునే ధైర్యం వైసీపీ నేతలకు లేదన్నారు. తాను కనీసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అడిగానని, వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు.
2047కు ఇప్పటి పసిబిడ్డలకు 50 ఏళ్లు వస్తాయి కానీ అప్పుడు మీకు జరిగే ప్రయోజనం ఉండదన్నారు. ఉపాధి అవకాశాలు ఇవ్వరు కానీ, రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు అన్న సీఎం జగన్ కేసుల భయంతో ప్రధాని మోదీతో మాట్లాడలేరని సెటైర్లు వేశారు. కేసులు ఉన్నవాడికి, మర్డర్లు చేయించే వాడికి, రుషికొండను విధ్వంసం చేయించే వారికి ధైర్యం ఉండదన్నారు. నిజాయితీయగా, నిస్వార్థంగా ఉండేవారు కేంద్రంతో మాట్లాడతారని, తాను అదేపని చేశానని గుర్తుచేశారు. సీఎం జగన్ కేంద్రం పెద్దల కాళ్లమీద పడితే వేల కోట్లు విడుదల చేశారని ఆరోపించారు.
ఒడిశాకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, తమిళనాడు ఎంపీలు పోరాడి సాధించుకున్నారు. కానీ ఏపీ ఎంపీలపై కేంద్రంలో చులకన భావం ఉందన్నారు. వీరు కేవలం డబ్బులతో ఎంపీలు అయ్యారని, వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోందని చెప్పారు. అందువల్ల యువతకు ఉద్యోగాలు లేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. 8 వేల కోట్ల నష్టం ఉంది, కానీ సొంతగనులు లేకపోవడం వల్లే నష్టం జరుగుందని కేంద్రానికి వివరించారు. తాను చెప్పింది ప్రధాని గుర్తిస్తారని, కానీ ఎంపీలు లేని తన మాట వృథా అవుతుందని, ఎంపీలను గెలిపించాలని కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో సొంత గనులు కేటాయించాలని ఎంపీలు అడగలేదు. కార్మిక సంఘాలు కలిసి సేలం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారు. ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా కార్మికులు అందర్నీ కలుపుకుని పోరాడాలని పిలుపునిచ్చారు. రౌడీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ క్రిస్టియన్ల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. గంగవరం పోర్టు, దిబ్బపాలెం సంబంధించి రెండు మత్స్యకార గ్రామాలను విధ్వంసం చేసిన వ్యక్తి జగన్. మీ నాన్న వైఎస్సార్ హయాంలో పోలీస్ తూటాలతో చంపించి గంగవరం పోర్టు నిర్మాణం జరిగిందని, ప్రైవేటీకరణ వల్ల నేటికి ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత జగన్ దే అన్నారు. ఆస్తులు అమ్ముకోడానికి నిన్ను సీఎం చేసింది అని జగన్ ను ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ లేదు, మరోవైపు అభివృద్ధి లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖాపెట్టి అప్పులు చేస్తున్న వ్యక్తి జగన్. ఎయిడెడ్ స్కూళ్లను పూర్తిగా ప్రైవేట్ చేస్తున్నారు.
తాను ఏదైనా మాట్లాడితే వైసీపీ మంత్రులు, నేతలు గయ్యాలి లాగ మీద పడి అరుస్తున్నారని.. గట్టిగా అరిస్తే అబద్దం నిజం కాదన్నారు. కుటుంబ సభ్యులను తిట్టారని, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని వెనకడుకు వేసే నైజం తనది కాదన్నారు. మంగళగిరి తరువాత విశాఖను రెండో ఇంటిగా చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దస్ పల్లా భూములు, సిరిపురం భూములు కేవలం 3 వేల గజాల భూమిని మాత్రమే కాపాడుకోగలిగాం. వైసీపీ నేతల తీరుతో పోలీసు శాఖ కూడా విసిగిపోయిందన్నారు.
పెందుర్తిలో అమ్మాయిల అదృశ్యం గురించి చెబితే వైసీపీ నేతలు తనను తిట్టారని, పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం తేలిందన్నారు పవన్. వాలంటీర్ల హస్తం ఉందని, వీరు సేకరించే డేటాకు బాధ్యత ఎవరు వహిస్తారు, వాలంటీర్లకు అధినేత ఎవరు, వీరికి జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారని 3 విషయాలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.
పార్టీలకు అతీతంగా 13,372 మంది సర్పంచ్ లకు మాటిచ్చారు.. ఇక్కడ కాలుష్యం లేకుండా చూడాలని, భూములు కబ్జా లేకుండా చూస్తే మీ కోసం కేంద్రంతో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో 70 ఎకరాల అడవి ఉంటే, వీసీ చెట్లను కొట్టేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ ఎక్కడికెళ్తే అక్కడ చెట్లను కొట్టివేస్తున్నారు. 200 పోస్టులకు అసోసియేట్ ప్రొఫెసర్లకు 80 వేలు జీతం ఇస్తామన్నారు. కానీ కూర్చునేందుకు క్లాసులు లేవు, మిమ్మల్ని విద్యాశాఖ ఇంకా గుర్తించలేదని చెప్పిందన్నారు.