తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఇవాల్టి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే టూర్ స్టార్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ జరిగే బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు. 


రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మొదట ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో గల దల్లవలస గ్రామంలో నుంచే ఈ టూర్‌ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకి వివరించనున్నారు. 


పన్నులు, ఛార్జీలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని బాదుడే బాదుడు పేరుతో టిడిపి నిరసనలను చేపడుతుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇన్‌చార్జీగా ఉన్న ఆమదాలవలస నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు. 


చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించి చాలా రోజులైంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండుసార్లు వచ్చినా శ్రీకాకుళంలో మాత్రం అడుగుపెట్టి చాలా కాలమైంది. అందుకే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 
 
తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోట. 2004 తర్వాత ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 2014 ఎన్నికల సమయంలో బలం పుంజుకున్నా ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రం వైసీపీ సత్తాచాటుకుంది. 2019 ఎన్నికలలో వైసీపీ మైదాన ప్రాంతాలతోపాటు ఏజెన్సీ ఏరియాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. అందుకే మళ్లీ రీబూట్ కావాలని టీడీపీ భావిస్తోంది.  రానున్న 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీడీపీ. 


చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనడం వెనుక కూడా శ్రీకాకుళం సెంటిమెంట్ ఉందని తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుందన్న భావన అందరిలోనూ ఉంటుంది. అది రాజకీయాలైనా ఇటు నిరసన కార్యక్రమాలైనా కూడా ఇక్కడ నుంచి ప్రారంభిస్తుంటారు. టిడిపి ప్రతిషా త్మకంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు అందుకే శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నట్లుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.