TDP Leader Kona VenkataRao Suicide: వైఎస్సార్‌సీపీ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ  రౌడీషీటర్లకి అనుచరులా అనే అనుమానాలున్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామంలో టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. టీడీపీ నేత బలవన్మరణానికి పాల్పడేలా చేసిన ఏపీ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.


టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మరణానికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నారా లోకేష్ మంగళవారం డిమాండ్ చేశారు. వెంకటరావు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్‌ల పేరుతో టీడీపీ కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలని లోకేష్ కోరారు. తాము చట్టాలని గౌరవిస్తున్నామని, పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.  






శ్రీకాకుళంలో టీడీపీ లీడర్ ఆత్మహత్య
మందస మండలం పొత్తంగి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలీసులు, వైసీపీ నాయకులు కక్షపూరితంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ మానసికంగా ఒత్తిడికి లోనై టీడీపీ కార్యకర్త కోన వెంకట రావు ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌‌ని (MLC Duvvada Srinivas) ప్రశ్నించినందుకు పోలీసులు వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భయపెట్టారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక పురుగులు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పురుగుల మందు తాగిన కోన వెంకట రావును పొత్తంగి గ్రామం నుంచి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.బలవన్మరణానికి పాల్పడ్డ కోన వెంకటరావు కుటుంబ సభ్యులతో డీఎస్పీ శివరామి రెడ్డి మాట్లాడారు. అయితే వేధింపులకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు డెడ్ బాడీని తీసుకువెళ్ళేది లేదని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. 


పలాసలో ఉద్రిక్తత (Palasa)
పలాసలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పరామర్శించారు. ఆసుపత్రి వద్ద మృతుడి భార్య కృష్ణవేణిని ఓదార్చిన శిరీష భావోద్వేగానికి గురయ్యారు. వెంకటరావు మృతికి కారణమైన పోలీసులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకువెళ్ళేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసు లేకుండా తమ కార్యకర్తల ఇళ్లకు వెళ్లే అధికారం పోలీసులుకు ఎవరిచ్చారని శిరీష ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నేతల బ్రోకర్లుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా హస్పిటల్ వద్ద టీడీపీ నేతకు ధర్నాకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.