అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రపై వైసీపీ లీడర్లు చేస్తున్న కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపి మిగిలిపోయిందని మండిపడ్డారు. రాజధాని కట్టాలనే ఆలోచన జగన్‌కి ఎందుకు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... రాజధానిపై చంద్రబాబు ఒక్కరే తీసుకున్న నిర్ణయంకాదని, అసెంబ్లీలో చర్చపెట్టామని అనంతరం అన్ని పార్టీలు అంగీకరించాయని గుర్తు చేశారు. 


రాజధాని అమరావతిలోనే కట్టాలని జగనే స్వయంగా అన్నారని గుర్తు చేశారు అయ్యన్న. కానీ ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు అరుస్తోన్న వాళ్లంతా ఆనాడు ఏమన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సా, రోజా ఆనాడు ఏమన్నారో వీడియోలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇప్పుడెందుకు మాట మార్చారని, జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందన్నారు. 


అసెంబ్లీలో తీర్మానం చేసి.. కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని దుయ్యబట్టారు అయ్యన్న. ప్రజలను అయోమయానికి గురి చేసి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కొంత మంది పెద్దలు రైతుల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి తిరుపతి వరకూ చేసిన పాదయాత్రకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికి తెలుసన్నారు. ఇప్పుడూ అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర చేస్తే వైసీపీ లీడర్లకు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు.
 
పాదయాత్రను దండయాత్రగా దుష్ప్రచారం చేస్తారా అని మండిపడ్డారు అయ్యన్న. అసెంబ్లీలో తీర్మానం చేస్తే చెల్లదని స్పీకర్ సీతారామ్ ఎలా చెపుతారని, స్పీకర్ తన హూందాతనం మరిచిపోయి మాట్లాడతారా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏ2 విజయసాయి రెడ్డి హయాంలో ఎంత దోపిడీ జరిగిందో అందరికీ తెలుసు అన్నారు. బే పార్క్, కార్తీక వనం దోచుకోలేదా... రుషికొండను రహస్యంగా కూలగొడతారా అంటూ విరుచుకుపడ్డారు అయ్యన్న. 


రైతు బజార్లను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న. కమిషనర్ బంగ్లా పక్కన ఉన్న స్థలం ఎవరి పేరు మీద మారిందని, 2008లో ఎస్సీ విద్యార్ధుల కోసం జారీ చేసిన స్ధలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇచ్చారని, దసపల్లా హిల్స్ స్ధలాన్ని డెవలప్‌మెంట్ పేరుతో యజమానులకి 30 శాతం, వైసిపి వారికి 70 శాతం వాటాగా నిర్ణయిస్తారా అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జీవీఎమ్సీ ఎలక్షన్‌లో డబ్బుల పంపిణీకి ఏయూ నుంచే డబ్బులు వెళ్లాయని, గంగవరం పోర్టును అతితక్కువ రేటుకు ప్రభుత్వ వాటా అమ్మేస్తే ఎందుకు మాట్లాడలేదని, ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకుంటే వైసిపి మంత్రులు ఏమైనా మాట్లాడారా అంటూ మండిపడ్డారు. 


రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన సుజలస్రవంతిని టీడీపీ నిర్లక్ష్యం చేయలేదని, రూ 3,650 కోట్లు కేటాయిస్తే దానిని రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశారని జగన్ పై నిప్పులు చెరిగారు అయ్యన్న. పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య శంకుస్ధాపన చేస్తే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించలేదా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు అమరావతి రైతులు వస్తోంటే తప్పుడు కూతలు కూస్తారా అని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి గుణాల్లో ఒక్కటైనా జగన్‌కు వచ్చిందా అంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు. 
 
ఎన్టీఆర్ భిక్షతో పెరిగి తప్పుడు మాటలు ఆడటం, రాజకీయాలకోసం ఆడవాళ్ల మీద దుర్భాషలాడటం మంచి పరిణామం కాదని అయ్యన్న సూచించారు. జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, దుర్మార్గుడిని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిదని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు అండగా ఉంటామని అన్ని పార్టీలు తీర్మానం చేసుకుని ముందుకు నడుస్తామని, పాదయాత్రకు స్వాగతం పలుకుతామని,  ఎవరు అడ్డువస్తారో చూస్తామంటూ సవాలు విసిరారు.


చంద్రబాబు బిస్కెట్లు తిన్న వ్యక్తి గుడివాడ అమర్: బుద్దా వెంకన్న


చంద్రబాబు బిస్కెట్లు తిన్న వ్యక్తి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అని ఉత్తరాంధ్ర టిడిపి ఇన్చార్జ్ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 
2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ కుటుంబానికి టిక్కెట్‌లు ఇచ్చారని, అమర్ టిడిపి హయాంలోనే  కౌన్సిలర్ అయ్యారన్నారు. రాజధానికోసం అరసవల్లి దర్శనానికి వెళ్లే రైతులపై తప్పుడు మాటలడతారా అంటూ ఆయనపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రను దోచుకోమని విజయ సాయిరెడ్డి అమర్‌కు అప్పగించి వెళ్లారని, అనకాపల్లిలో అమర్ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే మరోచోటు వెతుక్కుంటున్నారంటూ జోస్యం చెప్పారు. 2024 లో వైసిపికి ఫుల్ స్టాప్ పెడతారని, జగన్ దోచుకున్న సంపద అంతా తాడేపల్లి ప్యాలెస్ కే వెళుతోందని ఆయన కామెంట్‌ చేశారు.