TDP Chief Chandrababu: 
మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు
సీఎం జగన్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించిన మీడియాపై అక్రమ కేసులు పెట్టారని, తనను విమర్శిస్తే అరాచకం సృష్టిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి పరుడు, నేరస్తుడి చేతికి అధికారం ఇవ్వడం సమాజానికి శాపంలా మారిందన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కిరాణా కొట్టు, పానీ పూరీ బండిలో సైతం డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపుల్లో ఎందుకు లేవో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిజిటల్ పేమెంట్లు చేస్తే లెక్కలు బయటికొస్తాయనే భయంతోనే క్యాష్ పేమెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. 


వెంకటేశ్వర స్వామి పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రయత్నం 
అన్ని స్థానాల్లో టీడీపీ గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు. ప్రజల కోసం తెగించిపోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకూ రుణపడి ఉంటానన్నారు. ‘ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించే మీడియాను అడ్డుకునేందుకు ఏకంగా జీవో తెచ్చారు. చరిత్ర చూడని స్థాయిలో జగన్ రెడ్డి హయాంలో అక్రమాలు తెరపైకి తెచ్చారు. ఇసుక, మద్యం, భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. మైనింగ్ సెస్ కలెక్ట్ చేసేందుకు జిల్లాకో వైసీపీ బ్యాచ్ ను ఏర్పాటు చేశారు. తిరుపతిలో శ్రీవాణి దర్శనం టికెట్లు కూడా క్యాష్ రూపంలోనే కలెక్ట్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెంకన్నకు అపచారం తలపెట్టే వారికి శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి. శ్రీవాణి ట్రస్ట్ ఎవరు నడుపుతున్నారు, ఆ డబ్బు ఎటుపోతోంది? నీచ రాజకీయాలకు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు’ అని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


‘ఆడ బిడ్డలు చదువుకోవడానికి యూనివర్శిటీ తీసుకొచ్చాం. వారికి ఆస్తి హక్కు ఇచ్చాం. రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఎదుగుదలకు తోడుగా నిలిచాం. ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాం. డ్వాక్రా సంఘాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. చదువు,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టి మహిళల్ని ప్రోత్సహించాం. నా తల్లి కష్టాన్ని చూసి.. నా ఆడబిడ్డలు పడకూడదని దీపం పథకం తీసుకొచ్చాం. నాడు ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలు ఉన్నారంటే అది టీడీపీ తీసుకొచ్చిన చట్టమే. 
‘మహిళల్ని మరింతగా గౌరవించుకోవాలనే లక్ష్యంతో మహాశక్తి పథకం తీసుకొచ్చాం. 18-59 మధ్య మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తాం. తల్లికి వందనంతో ప్రతి విద్యార్ధికి సంవత్సరానికి రూ.15వేల చొప్పున అందరికీ అందిస్తాం. దీపం పథకం కింద సంవత్సరానికి నెలకు మూడు సిలిండర్లు అందిస్తాం. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. రూ.100 సంపాదిస్తే మరో వంద అప్పు చేసి పేదలకు రూ.20 ఇచ్చి రూ.180 దోచేస్తున్నాడు జగన్ రెడ్డి. యువగళం పథకంతో యువతకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటులో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇచ్చి వ్యవసాయానికి అండగా నిలుస్తాం. ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీటిని అందించి, ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం’ అన్నారు చంద్రబాబు.


గతంలో పిపిపి మోడల్ లో హైదరాబాద్ అభివృద్ధి చేశామని, ఇప్పుడు పి-4 మోడల్ తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం అన్నారు. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ వ్యయం తగ్గించాం. కానీ జగన్ రెడ్డి వచ్చాక సోలార్, విండ్ ఒప్పందాలు రద్దు చేశారు. రైతులకు సోలార్, విండ్ విద్యుత్తుపై అవగాహన కల్పించి, మెరుగైన విధానాలు అమలు చేస్తాం. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. బీసీలకు తొలి నుండి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయే. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 24శాతానికి తగ్గించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. సాధికారతతో కూడిన సంక్షేమ పథకాలను అమలు చేశాం. దసరా నాటికి టీడీపీ పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తాం. పూర్ టు రిచ్ నినాదంతో.. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం. ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ అంటే హేళన చేశారు. ఇప్పుడు అదే విధానానికి డీబీటీ అని పేరు పెట్టి హడావుడి చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 


జగన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పాలన చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. సమర్ధుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్ రెడ్డి వేసే పన్నుల బాదుడుతో ప్రతి కుటుంబంపై రూ.4లక్షల భారం వేశాడు. 2014లో ఏపీ లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు.. 2018-19కి రూ.2 వేల కోట్లకు తగ్గించాం. కానీ నేడు జగన్ రెడ్డి అసమర్ధ విధానాలతో రూ.40 వేల కోట్లకు చేర్చారు. సంపద సృష్టించే పోలవరాన్ని నాశనం చేశారు. అమరావతిని అటకెక్కించారు, పరిశ్రమల్ని తరిమేశారు, అభివృద్ధి దూరం చేశారు. 
నంబర్ 1 డ్రగ్ రాష్ట్రంగా ఏపీ..
రాష్ట్రం ఉత్తర, దక్షిణ కోరియా దేశాల్లా తయారైంది. దేశంలో నంబర్ 1 డ్రగ్ రాష్ట్రంగా ఏపీ తయారైందన్నారు. ప్రభుత్వమే విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యపారాన్ని ప్రోత్సహిస్తోంది. 175 సీట్లలో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలని, కుప్పంలో లక్ష మెజారిటీ గెలుపే లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది పోటీ వద్దన్నారు. కానీ పోటీ చేసి బంఫర్ ఫలితాలు సాధించాం. పులివెందుల ఎమ్మెల్సీ గెలిచాం. ఎమ్మెల్యే స్థానం కూడా గెలవాలి. పంచుమర్తి అనురాధ రెండుసార్లు అవకాశం కోల్పోయారని ఈసారి అవకాశం ఇచ్చాం. కాఫీ ఖర్చు లేకుండా అనురాధ గారిని గెలిపించారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చాలి. 
చేతగానివాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారని, తన వయసు గురించి మాట్లాడుతున్నారని.. తాను చేసే పనిలో 20 శాతం కూడా జగన్ రెడ్డి చేయలేడు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాత్రి అయితే పబ్జీ ఆడుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఆయననేమి ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు? పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజాసమస్యలపై అధ్యయనం చేసి పార్టీకి రిపోర్టు ఇవ్వాలి. దాన్ని బట్టి పార్టీ మేనిఫెస్టో తయారుచేస్తామని పార్టీ నేతలను ఆదేశించారు.