‘‘విద్యకు పెద్దపీట వేస్తున్నాం.. రేపటి పౌరుల విద్యాభివృద్ధే మా లక్ష్యం.. 'నాడు నేడు’ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల దశదిశ మార్చే స్తున్నాం.. మారుమూల పల్లెల్లోని స్కూళ్లపైనా శ్రద్ధ వహిస్తున్నాం.. గ్రామీణ విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసేస్తున్నాం..’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నోసార్లు చెప్పింది. కానీ, తాజా ఘటన ఒకటి అవేవీ క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా కనిపించడం లేదని స్పష్టం అవుతోంది.


ఇదేమీ శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని గులు మూరు పంచాయతీ కొత్తపేట గిరిజన గ్రామంలో ఎంపీపీ పాఠశాలకు వర్తించడం లేదు. అభివృద్ధి సౌకర్యాల వంటి మాటలు అటుంచితే విద్యార్థుల పరిస్థితి దినదిన గండంలా మారిపోయింది. వర్షం వచ్చిందంటే వణుకు పుడుతోందీ ఇక్కడి విద్యార్థులకు. పాఠశాల భవనాలు శిథిలమై వర్షాలకు నీరు కారుతున్నాయి. దిక్కుతోచక విద్యార్థులు గొడుగుల కింద విద్య కొనసాగిస్తున్న దుస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షం వచ్చినా గొడుగు పట్టాల్సిందే. ఉదయం నుంచి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీనితో తరగతి గది పైకప్పు నుంచి వర్షపు నీరు పడుతుండడంతో గొడుగులు వేసుకుని విద్యార్థులు తిప్పలు పడ్డారు.


తరగతి గది పైకప్పు శిథిలమై పెచ్చులు ఊడిపోవడంతో భయానక పరిస్థితి నెలకొంది. వర్షాలు ముదిరితే పైకప్పు పెచ్చులు పడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొడుగులు వేసుకుంటూ పాఠ్యాంశాలు వినాల్సి వస్తోందని వాపోయారు. కొత్తపేట పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 22 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఏకోపాధ్యాయుడినే నియమించారు. దీంతో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తరగతి గది పెచ్చులు పడుతుండటంతో ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు భీతిల్లుతున్నారు.


దీనిపై మండల విద్యాశాఖ అధికారి  వద్ద  ప్రస్తావించగా తరగతి గది శిథిలావస్థలో ఉందని తెలిపారు. మూడో విడత నాడు - నేడు పథకంలో నూతన భవనాలు మంజూరు చేసినట్లు చెప్పారు. గతం నుంచి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఈసారి మంజూరు చేస్తాం కచ్చితంగా చేస్తామని చెబుతున్నారు తప్ప పూర్తిస్థాయిలో ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. అదనపు తరగతి గది మంజూరు కోసం సమగ్ర శిక్ష ఏపీసీకి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఎం ఎలప్పురం కాలనీ పాఠశాల భవనం మంజూరుకు పంపించామని తెలిపారు.