Vizag Janasena :  విశాఖ నగరం అంటే గుర్తొచ్చే పెద్దజాలరిపేట రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణానికి  చిరునామాగా మారుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ-2 గా సంవత్సరానికి పైగా జైల్లో ఉండి వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి జాలరిపేటలో వంద ఏళ్లుగా నివాసం ఉంటున్న పెద్ద జాలరి పేట .. స్థానిక మత్స్య కారులది కాదని అంటుున్నారని ఆయన వివరాలను బయట పెట్టారు.  జాలరి పేటపై  భూ హక్కులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రతిఫలం గా 2800 కోట్ల రూపాయలు విలువ చేసే టిడిఆర్ బాండ్ లు పొందేందుకు ఆఘమేఘాల మీద ఫైళ్లు కదులుతున్నాయని మూర్తి యాదవ్ ఆరోపంచారు. 


పెదజాలరిపేటలో మత్స్యకారులకు హక్కులు లేవని వాదన 


 పెదజాలరిపేట పై హుక్కు లు 1921 వసంవత్సరంలో రాణి సాహిబా వాద్వాన్ కు  ఉన్నాయి అంటూ ఒక చిన్న కాగితాన్ని తీసుకొచ్చి వేల కోట్లు కొట్టేసేందుకు అధికారులు ద్వారా పావులు కలిపారని మూర్తి యాదవ్ వివరాలను మీడియాకు వెల్లడించారు.   విశాఖ ఆర్ డీ ఓ హుస్సేన్ సాహెబ్ నేతృత్వంలోని పదుల సంఖ్యలో అధికారులు ఇదే పనిలో ఉన్నారన్నారు. జాలరి పేట మత్స్య కారులను ప్రభుత్వ పధకాల పేరిట మభ్యపెట్టి పది మంది వీఆర్వో లతో డాక్యుమెంట్లను సేకరించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వ పెద్దలు గతంలో జైలుకు వెళ్లి వచ్చిన కొందరు ఉన్నతాధికారుల సహకారంతో వేల కోట్లను కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. 


తప్పుడు పత్రాలతో వేల కోట్లు కొట్టేసే ప్రయత్నాలు 


 ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1956, ల్యాండ్ సీలింగ్ 1976 చట్టం  ప్రకారం నగర పరిధిలో ఒక వ్యక్తికి 1800 గజాలకు మించి స్థలం ఉండటం నిషేధం. యు ఎల్ సి చట్టం రద్దయిందన్న సాకుతో తప్పుడు పత్రాలు  , అసంబద్ధ క్లైములతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల చిల్లులు పెట్టే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విధానంలో దసపల్లా భూములను కొట్టేసిన విశాఖలోని భూకబ్జా బ్యాచ్ ఇప్పుడు పెదజాలరిపేట పై పడింది. ఇది తమ భూమి అంటూ  రాణి వారసులకు పేరిట క్లైమ్ చేయించి  భారీ కుంభకోణానికి తెర లేపారని మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు.  ఈ రకమైన అక్రమ లావాదేవీలకు పెట్టింది పేరైన ఆయన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రమేయంతో ,ఒత్తిడితో ఆగమేగాల మీద ఫైళ్లు కదులుతున్నాయి. జాలరి పేట భూములకు టి డి ఆర్ ఇవ్వటమే పెద్ద తప్పు అయితే, అందుకోసం అక్కడి భూముల విలువలను విపరీతంగా పెంచేశారన్నారు.   పూర్తిగా సి ఆర్ జెడ్ పరిధిలోకి వచ్చే పెదజాలరిపేట రిజిస్ట్రేషన్ విలువ చాలా తక్కువగా ఉండాలి. కుట్రపూరితంగా   వీటి విలువ ను పెంచుచూపి భారీగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 


గతంలో ఇచ్చిన ప్రభుత్వ పట్టాలకు విలువ లేదా?


జాలరి పేట భూములకు ఎన్టీ రామారావు ప్రభుత్వంలోనూ,  ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లోను  ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ప్రభుత్వం పేదలకు పట్టాలు మంజూరు చేయటం అంటే ఆ  భూమి ప్రభుత్వం తనదే అని భావించి సర్వ హక్కులు కల్పించడమే. ఇందులో ప్రభుత్వం వేసిన రహదారులు, పార్కులతో పాటు అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ  కార్యాలయాలు ఉన్నాయి. కబ్జాదారులైన ప్రభుత్వ పెద్దలు విచిత్రం గా ప్రభుత్వమే భూములను కబ్జా చేసిందని భావిస్తూ క్లైములు చేయిస్తున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 296, 388 ప్రకారం పట్టాలు క్రమ బద్దికరింపబడ్డాయి.  అయినా పట్టించుకోకుండా వాల్తేరు వార్డు టౌన్ సర్వే నెంబర్. 361/ఎ/2 లో 8.93 ఎకరాలు, సర్వే నెంబర్.362 లో 11.34 ఎకరాలకు, 363లో కొంత భాగానికి  ప్రవేటు వ్యక్తుల క్లైమ్ ని ఆమోదించడమంటే ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలకు చట్ట బద్ధత లేదని అంగీకరించటమేనని నిపుణులు చెబుతున్నారు. 


 మిగిలిన భూములకి ఇలాగే ఇస్తారా?


ఇక్కడ ఆమోదిస్తే విశాఖ నగరంలో సగానికి పైగా భూములకు ఈ తరహా క్లైమ్ లు వస్తాయి. తమ పూర్వీకులకు చెందినవి అని  ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం లక్షల కోట్లలో టీడీఆర్ చెల్లించాల్సి వస్తుంది. సింహాచలం దేవస్థానం ఈ పని  చేస్తే పంచ గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలకు  లక్షల కోట్లు చెల్లించాలని మూర్తి యాదవ్ చెబుతున్నారు.  ఎన్ టీ పి సి, హిందూజా విద్యుత్ కర్మాగారాల భూములకు రాష్ట్ర  వక్ఫ్ బోర్డుకు వేలకోట్లలలో చెల్లించాల్సి వస్తుంది. నగరంలోని గతంలో ఈ రకమైన క్లైమ్ లో వస్తే అధికారులు వాటిని తోసిపుచ్చారు. వందేళ్ల  క్రితం నాటి క్లైమ్ ను తిరస్కరించకుండా, న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయకుండా అనుమతించి అత్యుత్సాహంతో పనిచేయడం అంటే పాలకులతో  పాటు అధికారులు కూడా అవినీతికి పాల్పడినట్టేనంటున్నారు.   ఇందుకు బాధ్యులైన జిల్లా కలెక్టర్, జివియంసి మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, సర్వే విభాగం అధికారులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి,  సి సి ఎల్ ఏ కమిషనర్ వంటి వారంతా బాధ్యులు అవుతారని హెచ్చరించారు.  పెద్ద జాలరి పేట భూముల టిడిఆర్ స్కామ్ విషయం లో రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని  న్యాయ స్థానంలో సవాల్ చేయాలి మూర్తి యాదవ్ డి్మాండ్ చేశారు.