Gold Coloured Chariot In Srikakulam: అసని తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం సున్నాపల్లి వద్ద సముద్ర తీరానికి బంగారు వర్ణంతో ఉన్న రథంలా ఉన్న ఓ పడవ కొట్టుకు వచ్చింది. అసని తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం కావడంతో ఈ పడవ తీరానికి కొట్టుకొచ్చింది. ఫిబ్రవరి నెలలో నెల్లూరు జిల్లాకు కూడా ఇలాంటి పడవే ఒకటి కొట్టుకొచ్చింది. అప్పట్లో అది శ్రీలంకనుంచి వచ్చినట్టుగా భావించారు. ఆ పడవలో కేవలం బుద్ధుడికి చెందిన ఓ ఫ్లెక్సీ, కొన్ని వస్తువులు మాత్రమే ఉన్నాయి. వాటిని పోలీసులు సేకరించి భద్రపరిచారు. బంగాళాఖాతంలో లోపలికి వెళ్లే జాలర్లకు సుదూరంగా ఇలాంటి పడవలు కనిపిస్తాయనే వార్తలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. గతంలో నెల్లూరు తీరానికి ఒకటి, ప్రస్తుతం శ్రీకాకుళం తీరానికి మరో పడవ కొట్టుకు వచ్చాయి. ఈ రెండు పడవలు.. బుద్ధుడిని ఆరాధించే ప్రాంతాలనుంచి వచ్చాయనేది మాత్రం వాస్తవం.
బుద్ధుడిని పూజించే ప్రాంతాల్లో గోల్డెన్ బార్జ్, రాయల్ బార్జ్ పేరుతో ప్రతి ఏటా పడవులలో ఊరేగింపు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. బుద్ధుడి ప్రతిమను, లేదా ఆయన ఫొటోను ఉంచి పడవలతో నదులలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత కొన్ని పడవలను సముద్రంలో వదిలిపెడతారు. మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక.. ప్రాంతాల్లో ప్రతి ఏటా ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో సముద్రంలో వదిలిపెట్టిన పడవలు తుపాను సమయాల్లో ఇలా ఇతర ప్రాంతాలకు కొట్టుకు వస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో వచ్చిన పడవ కూడా ఇలాంటిదే, గతంలో నెల్లూరు జిల్లాకు వచ్చిన పడవ కూడా ఇదే. మనదేశంలో ఇలాంటి ఆచార వ్యవహారాలు లేవు కాబట్టి.. ప్రస్తుతానికి ఇవి మనకు తేలియాడే దేవాలయాలు.
తీరాన్ని తాకిన అసని తుపాను..
అసని తుపాను బాపట్లలో, బందర్‌లో తీరాన్ని తాకింది. మరికొన్ని చోట్ల తీరాన్ని తాకే దిశగా తుపాను చురుకుగా కదులుతోంది. తుపాను పరిసర ప్రాంతాల్లో మాత్రం 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం సమీప ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 60-80 కి.మీ. మధ్య ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, తీరం వెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తీరానికి తరలివస్తున్న స్థానికులు
తీరం వైపునకు మందిరం (రథం) కొట్టుకురావడంతో ఇది గమనించిన స్థానికులు మొదట్లో ఆందోళనకు గురయ్యారు. సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి తీరానికి దాదాపు చేరుకున్న తరువాత మందిరం లాంటి రథాన్ని స్థానికులు తాళ్లతో లాగుతూ ఒడ్డుకు తీసుకొచ్చారు. వింత రథం విషయం తెలియగానే స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. తీవ్రరూపం దాల్చిన తుపాను (Cyclone Asani Effect) ప్రభావంతో బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతి కలిగింది.