బాదుడే బాదుడు ఒకవైపు... గడపగడపకు మన ప్రభుత్వం ఇంకోవైపు. ఈ రెండు కార్యక్రమాలతో అధికార, ప్రతిపక్షాలు ప్రజల్లో తమ పరపతిని పరీక్షించుకుంటూనే వచ్చే ఎన్నికలకు స్ట్రాంగ్‌ గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకొని హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్  దుమారాన్ని రేపుతున్నాయి.  


ప్రజల వద్దకు వెళ్తున్న నేతల ప్రసంగాలు ఎన్నికల ఫీవర్‌ని తలపించేలా ఉంటున్నాయి. నేతల పని తీరుపై ఫీడ్‌ బ్యాక్ ఎప్పటికప్పుడు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుతున్న వేళ వైసీపీ నేతలు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. హెచ్చరికలు, శాపనార్థాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. 


పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో ప్రజలు తమవెంటే ఉన్నారన్న ధీమాలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. అయినా ప్రజలు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడతారేమో అన్న అనుమానంతో కొందరి నేతల మాటల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. 


పాపం తగులుతుంది


వజ్రపుకొత్తూరు మండలంలోని గరుడభద్రలో మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం పర్యటించారు. ఈ గ్రామం మంత్రి సతీమణి శ్రీదేవి స్వగ్రామం. ఆ గ్రామ అల్లుడినని చూడకుండా టీడీపీకి మెజార్టీ ఇచ్చారని మంత్రి సీదిరి గుర్తు చేశారు. అయినా సరే గ్రామానికి భారీగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో అధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. దీన్ని అందరూ స్వాగతించారు. 


అదే గ్రామంలో గడపగడపకూ తిరుగుతూ ఓ లబ్ధిదారుతో మాట్లాడారు మంత్రి సీదిరి. ఆమెకు వచ్చిన పథకాలను వివరించారు. మాటలో మాటగా ఈసారి వైఎస్‌ఆర్‌సీపీకి ఓటేయకపోతే పాపం తగులుతుందని మంత్రి అనేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. చనువుతో సీదిరి చేసిన ఈ కామెంట్స్‌ స్థానికంగా కూడా చర్చనీయాంశమయ్యాయి.


బాదుడే బాదుడంటే.. చితగ్గొట్టేయాలి


మాజీ మంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని... పనిచేసే వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని టీడీపీ ఇప్పుడు బాదుడే బాదుడని ప్రజల్లోకి వస్తుందన్నారు. అలా వస్తే చితగ్గొట్టేయాలని జనాలకు సూచించారు. ఈ మాటలకు సమావేశంలో ఉన్న కేడర్ ఆశ్చర్యపోయింది. 


టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అచ్చెన్నను నడిరోడ్డుపై కొడతానని హెచ్చరించారు. ఇప్పుడు కృష్ణదాస్ అలాంటి కామెంట్స్ చేశారు. ఇలా జిల్లా నేతలు ప్రజలను ఆకట్టుకోవాలని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా... ప్రత్యర్థులకు ప్రచార అస్త్రాలు అందినట్టు అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.