Srikakulam Bhakti Vikas:  అక్కడ విద్యుత్, టీవీలు, చరవాణి లేదు. ఈ గ్రామస్తుల ఆలోచనల్లో చైతన్య కాంతి మాత్రమే ప్రసరిస్తుంది. ఆధ్యాత్మిక చింతన దర్శనమిస్తుంది. ఆధునిక హంగులేవీ లేని ఈ గ్రామం ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన సుఖవంతమైన జీవనానికి అద్దం పడుతోంది. ఉన్నత చదువులు, పెద్ద పేరొందిన ఉద్యోగాలు, సంపన్న జీవనాన్ని అనుభవించని గ్రామస్తులు జీవిత పరమార్థం ఇది కాదేమో అని భావించినట్లుంది. పరమాత్మకు చేరువయ్యే వికాసమార్గంలో సనాతన ధార్మిక జీవనంగా భావించి చక్కనైన జీవన విధానాన్ని అనుసరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. కృష్ణచైతన్య సమాజం పేరుతో కూర్మ గ్రామంలో 56 మంది జీవిస్తున్నారు. 12 గృహస్తులు జీవన కుటుంబాలుగా ఉన్నారు. ఇక్కడ 16 మంది విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారు లు జీవిస్తున్నారు. 2018 జూలైలో భక్తివేదాంతస్వామి ప్రభు నాదుల ఆదేశాలలో భక్తివికాస్ స్వామి సారథ్యంలో ఈ పల్లె ఏర్పడింది. సరళ జీవనం, ఉన్నతమైన చింతన వీరి విధానం. అత్యవసరాలైన కూడు, గూడు, ఆహార్యాలను ప్రకృతి నుండి పొందవచ్చని నిరూపించారు.


కూడు..గూడు మొత్తం రెండు శతాబ్దాలక కిందటిలానే సేకరించుకోవాలి ! 


ప్రకృతి సేద్యంతోనే అన్నవసతులు సమ కూర్చుకుంటున్నారు. ఒక్క ఏడాది కి 198 బస్తాలధాన్యం పం డించి ఔరా అనిపించారు. విత్తనాలు విత్తిన నుండి కోతలు, మోతలవరకూకూలీలపైనా ఆధారపడరు ఇక్కడి నివాసితులు. ధాన్యం పంపుకొని దంపుడు బియ్యాన్ని వండి వార్చుతున్నారు. ఎవరైనా వెళ్లినా అంతే ఆత్మీయంగా వడ్డిస్తారీ గ్రామస్తులు. దస్తులను కూడా సొంతంగా నేస్తూ తయారు చేస్తున్నారు. కేవలం నేత కార్మికులు గానే కాదు... ఇళ్లు నిర్మించే మేస్త్రీలూ, కూలీలు వీరే. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రంగా చేసి గానుగ పట్టి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు కట్టుకున్నారు. ఇటుకలు కూడా ఆవు పేడతోనే తయారు చేసినవి వినియోగించి అద్భుతాన్ని ఆవిష్కరిం చారు. అంతే అబ్బురంగా... వారు ధరించిన దుస్తులు ఉతుక్కోవడానికి కుంకుడు రసం వాడుతున్నారు. సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, వర్ణాశ్రమ విధాన పునఃస్థాపన లక్ష్యమని ముందడుగు వేస్తున్నారు.


అప్పట్లో పిల్లలకు చెప్పే విద్యే చెబుతారు ! 


పిల్లలు గురుకుల విధానంలో వర్ణాశ్రమ విద్యనభ్యసిస్తున్నారు. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడుతారు. వయస్సు, ఆసక్తి ఆధారంగా చేతి వృత్తులపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. వేకువజామున 4.30 గంటలకు దైవానికి హారతితో మొదలైన వీరి దిన చర్య... ఉదయం భజన, ప్రసాదం స్వీకరణ తర్వాత రోజువారీ పనులు మొదలుపెడతారు. వ్యవసాయం, ఇంటి నిర్మాణాలతో ధర్మప్రచారంలో గావిస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమవుతారు. యాంత్రిక జీవనానికి తొలి భీజం విద్యుత్ గనుక దీనికి దూరంగా ఉంటారు. విద్యుత్ సౌకర్యం ఉంటే మనిషి యాంత్రకంగా మారుతాడని, మనసు కలత చెందుతుందని భావిస్తారు. ఒకే ఒక్క గుడిసెతో మొదలైన 'కూర్మ' గ్రామంఇప్పుడు 56 మంది నివాసం ఉన్నారు. మరో ఐదేళ్లలో 50 కుటుంబాలు ఏర్పాడ తాయని గ్రామస్తులు చెబుతున్నారు.


 కూర్మ గ్రామంలో ప్రకృతి జీవనం 


ఇక్కడ జీవిస్తున్న రష్యాకు చెందిన హరిదాస్ ఏమన్నారంటే దేవుని గురించి చైతన్యం లేని జీవితం ఎందుకని ప్రశ్నించారు. ప్రకృతితో సహజీవనం, ప్రతీ పనిలోనూ దైవచింతన, ధార్మిక ఆలోచన అలవరుస్తున్నాం అన్నారు. వర్ణాశ్రమ బోధకుడు నటేకర్ నరోత్తమ్స్ మాటల్లో... వర్ణాశ్రమ కళాశాలలో వృత్తికళలు, బతుకు దెరువుకు అవసర మైన శిక్షణ ఇస్తున్నాం అన్నారు. గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కూర్మ గ్రామం నెలకొల్పినట్లు చెప్పారు. హంగేరిలో 800 ఎకరాల్లో కూర్మ విస్తరించిందని తెలిపారు. చెక్ రిపబ్లిక్ లోనూ ఓ పల్లె ఉన్న సంగతి చెప్పారు. మనిషి జీవితలక్ష్యంపై నిజమైన అవగాహన కల్పించడమే కృష్ణచైతన్యం, సనాతన వైదిక ధర్మం, భారతీయ సంస్కృతికి నిలువుటద్దం. అందుకోసమే మా ఈ చిన్న ప్రయత్నం కూర్మ గ్రామంలో ప్రకృతి జీవనం అని ముగించారు.