Somu Letter To Jagan :  విశాఖపట్నంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న భూదందాలపై విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖను సీఎం జగన్‌కు రాశారు.  విశాఖపట్నం నగరం, పరిసర ప్రాంతాల్లో మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు,వారి కుటుంబాలకు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములు, సామాన్య మధ్యతరగతికి చెందిన వారి భూములే కాదు, ఎక్కడ ఖాళీగా కనబడితే అక్కడ    భూముల్ని కబ్జాలు చేశారని సోము వీర్రాజు ఆరోపించారు.  విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దురాక్రమణకు గురైన భూములను కబ్జా రాయుళ్లు నుండి తిరిగి స్వాధీనం చేసుకుని వాటి నిజమైన యాజమాన్యాలకు అప్పగించాల్సిన ప్రభుత్వం చూస్తూండిపోయిందని మండిపడ్డారు. 


గత రెండు దశాబ్దాలుగా విశాఖపట్నం పరిధిలో, వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో  ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రైవేటు, వివాదాస్పద భూముల దురాక్రమణలు జరిగాయని సీఎం జగన్‌కూ తెలుసన్నారు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని తెగనమ్ముకోవటానికి ఎన్ఓసీలు పొందటం, మాజీ సైనికులకు,  స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన ప్రభుత్వ భూములను నయానో  భయానో బెదిరించి స్వాధీనం చేసుకుని వాటికి అనేక వక్ర మార్గాల్లో ఎన్వోసీలు పొందడం అందరికీ తెలుసన్నారు.  ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం  వేల కోట్ల విలువైన అక్రమలావాదేవీల మీద, భూములు అన్యాక్రాంతం కావటం మీదా సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 


2004  నుండి  అప్పటి  ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన భూదందా ... ఇప్పటివరకు  జరుగుతూనే ఉన్నాయని మీడియాలో పుంఖాను పంఖాలుగా కథనాలు వస్తున్నాయన్నారు.  మీ చిత్త శుద్ధిని నిరూపించుకోవటానికి మొత్తం వ్యవహారాలను సిబిఐ'కి, లేదా సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి సమీక్షకీ ముందుకు రావాలని సవాల్ చేశారు.  విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చిన్న మధ్య తరగతి పేద బడుగు బలహీన వర్గాలు  నీడకోసం గూడుకోసం కష్టార్జితాన్ని వెచ్చించి కొనుక్కున్న ఇళ్ల స్థలాలకు,  వారసత్వంగా  వచ్చిన ఆస్తులకు ఆంక్షలు పెట్టిన ప్రభుత్వాలు  ప్రభుత్వ భూములను, స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన భూములను, దేవస్థానం భూములను  గద్దల్లా తన్నుకుపోతున్న కబ్జాదార్లను ఎందుకు వదిలేస్తున్నారో చెప్పాలన్నారు.   
  
*నాటి తెలుగుదేశం  ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు 'సిట్' వేసింది, కానీ కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయి. తరువాత అధికారానికి వచ్చిన‌ మీరు అంతకు ముందిచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వ దురాక్రమణలపై  పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తారని ప్రజలు వేచి చూచారు. మీ  ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా విచారణలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు?  నాటి సిట్ నివేదిక‌ ఏమైంది? మీ ప్రభుత్వ విచారణ ఏమైంది?  అని సోము వీర్రాజు ప్రశ్నించారు. తన  బహిరంగ లేఖను మీ "స్పందన" లో వచ్చిన అత్యవసర ఫిర్యాదుగా స్వీకరించి తక్షణమే ఉత్తరాంధ్ర భూ కబ్జాల మీద స్పందించాలని సోము వీర్రాజు కోరారు.