విశాఖపట్నంలో నగర అందాన్ని పెంచేలా ఇటీవల నిర్మించిన మోడ్రన్ బస్ షెల్టర్లలో లోపాలు అప్పుడే బయటపడుతున్నాయి. తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్ సౌత్ సైడ్ బస్ షెల్టర్ కుంగిపోయింది. ఈ బస్ షెల్టర్లను విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. జీవీఎంసీ కార్యాలయం ముందు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ షెల్టర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాదాపు రూ.4 కోట్లతో విశాఖపట్నంలో ఇదే తరహాలో 20 వరకూ బస్సు షెల్టర్లను జీవీఎంసీ నిర్మించింది. 


ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి, పట్టుమని నెల రోజులు కూడా నిలవకుండానే షెల్టర్లు కుంగిపోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ షెల్టర్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు. కుంగిన షెల్టర్‌ వద్ద సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.