Rishikonda Palace:గత వైసీపీ ప్రభుత్వంలో కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్‌లో నిర్మించిన రిషికొండ భవనాన్ని టూరిజం శాఖకు ఆదాయం తెచ్చేలా డెవలప్ చేస్తామన్నారు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామి. రుషికొండ ప్యాలెస్‌ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో వీరు సభ్యులు.
ప్రభుత్వానికి భారంగా మారిన రిషికొండ ప్యాలెస్
గత ప్రభుత్వం అధునాతనంగా నిర్మించిన రిషి కొండ ప్యాలెస్ ఖర్చు 500 కోట్లు అంటూ అప్పటి విపక్షాలైన టీడీపీ, జనసేన పదే పదే ఆరోపించాయి. అయితే తాము అధికారంలోకి వచ్చాక ఆ భవనాన్ని ఎలా వాడాలి అన్నది అర్ధం కావడం లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతీ నెలా దాని నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి భారంగా మారింది. అందుకే రిషి కొండ ప్యాలస్‌ని ఏం చెయ్యాలి అనే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ వేసింది ప్రభుత్వం. వారి భేటీ వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు
రిషికొండ ప్యాలస్ ను హై లెవల్ టూరిజం హోటల్స్‌గా మార్చే అవకాశం ?
ఈ సందర్భంగా గత భేటీలో సూచనల మేరకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని పర్యాటక శాఖ అధికారులు సబ్ కమిటీ ముందుంచారు. రుషికొండ ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై వెబ్ సైట్ లో స్పందన కోరగా 1517 మంది ప్రజలు, 44 మంది స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారని అత్యధిక శాతం ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పును త్వరితగతిన సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారని వెల్లడించారు. మరికొందరు హోటల్, రిసార్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ప్లానిటోరియం, మైస్, వెల్ నెస్ సెంటర్ గా, ప్రభుత్వ కార్యాలయంగా వినియోగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సబ్ కమిటీ వెల్లడించింది.
అంతిమంగా సంస్థల సమర్థతను పరిగణలోకి తీసుకొని ప్రజలకు ఉపయోగపడుతూనే, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగించేలా నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫలక్ నామా ప్యాలెస్ కట్టడాన్ని సహజత్వం కోల్పోకుండా ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశాన్ని ఉదహరించారు.
ప్రతీ నెలా రిషికొండ ప్యాలెస్ నిర్వహణకు 25-30 లక్షలు ఖర్చు అవుతోంది - మంత్రుల కమిటీ
మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం రుషికొండపై పర్యాటక శాఖకు అధిక ఆదాయాన్నిచ్చే హరిత రిసార్ట్స్ స్థానంలో విజయనగర, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఈస్టర్స్ గంగ తదితర పేర్లతో కూడిన 7 బ్లాక్ లతో 19,968 చదరపు మీటర్లలో రాజప్రాసాదం లాంటి ప్యాలెస్ ను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుతం ప్రతి నెలా 25-30 లక్షల మెయింటెనెన్స్ చార్జీల భారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని తీసుకున్నామని త్వరలోనే దీన్ని పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు కూడా ఉపయోగపడేలా సముచిత నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇప్పటికే టాటా, అట్మోస్పియర్ కోర్, ఐహెచ్ సీఎల్, హెచ్ఈఐ తదితర సంస్థలు ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుందో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లిబుచ్చాయని, మరికొన్ని విదేశీ సంస్థలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయన్నారు. కొన్నింటికి పూర్తిస్థాయి స్పష్టం రావాల్సి ఉందన్నారు. మరో భేటీకి పూర్తి స్పష్టత వస్తుందని అనంతరం రెండు మూడు ప్రతిపాదనలు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సాధ్యమైనంత త్వరగా మరోసారి భేటీ అయి రుషికొండ ప్యాలెస్ పై కీలక నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ పేర్కొంది. సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు రుషికొండ ప్యాలెస్ కు సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు.