Banwarilal Purohit:  విశాఖలో శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు పీఠాన్ని దర్శించుకుంటున్నారు. శనివారం పంజాబ్ గవర్నర్ బన్వర్ లాల్ పురోహిత్ ఈ మహోత్సవాల్లో పాల్గొన్నారు. చండీఘడ్ నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ఈ  వార్షికోత్సవాలకు విచ్చేశారు. 


శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న పంజాబ్ గవర్నర్ బన్వర్ లాల్ పురోహిత్... రాజశ్యామల అమ్మవారిని ప్రత్యేకంగా పూజించారు. అమ్మవారి విశిష్టతను అడిగి తెలుసుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. పూజల అనంతరం పండితులు గవర్నర్ పురోహిత్ కు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. 


విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ... ఈ పీఠం పూర్వీకులు ఆస్తిపాస్తులు ఇచ్చినట్లు ఏర్పడిమది కాదని.. ఉపాసనా శక్తితో నిర్మాణమైన పీఠం తమది అని చెప్పారు. ఉపాసనా విధానం పుస్తకాల్లో దొరికేది కాదన్నారు. వైదికంగా ఎవరో చెబితే వచ్చేది కాదని తెలిపారు. తపస్సు ద్వారా పొందిన శక్తితో పీఠం ఉపాసనా విధానం తయారైందని వివరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో యావత్ భారతావనిలోనే శక్తివంతమైన పీఠంగా ఇది గుర్తింపు పొందిందన్నారు.